ఒక్కసారి కాదు.. రెండు సార్లు కాదు.. ఇప్పటికి వివిధ ఎన్నికల్లో పోటీ చేసేందుకు దాదాపు 178సార్లు నామినేషన్ వేశారు. కానీ ఒక్కసారి కూడా గెలవలేదు. కానీ ఆయన నామినేషన్ వేయడం మాత్రం ఆపలేదు. తాజాగా 179వ సారి నామినేషన్ వేశారు. ఆయనే పద్మరాజన్.  

తమిళనాడుకి చెందిన పద్మరాజన్ ఇప్పటి వరకు వివిధ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేయించుకున్న కె పద్మరాజన్ 179వసారి ధర్మపురి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. పట్టాలీ మక్కల్ కచ్చీ నాయకుడు అంబుమణి రామ్ దాస్ పై పద్మరాజన్ పోటీ చేస్తున్నారు.

 హోమియోపతి వైద్యుడైన పద్మరాజన్ కేవలం ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలవడం కోసమే సంపాదిస్తున్నారు. 1988 వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పంచాయతీ నుంచి రాష్ట్రపతి ఎన్నికల దాకా పలు ఎన్నికల్లో పోటీ చేసిన పద్మరాజన్ పేరును లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మూడుసార్లు పేరు లిఖించారు. 

మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి, మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, కరుణానిధి, సీనియర్ నేతలు పీవీ నరసింహారావు, ఏకే ఆంటోని, కేఆర్ నారాయణన్, ఎస్ఎం కృష్ణ, మన్ మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ, ఎంకే స్టాలిన్, విజయకాంత్లపై పద్మరాజన్ పోటీ చేసి ఓటమి చవి చూశారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ ఎన్నికల్లో పద్మరాజన్ పోటీ చేశారు. 

ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేయడం హక్కు అని, తాను ఓడిపోకుండా గెలిస్తే మాత్రం తనకు గుండెపోటు వస్తుందని పద్మరాజన్ వ్యాఖ్యానించారు. 2016వరకు తాను పలుసార్లు పోటీ చేసి రూ.20 లక్షల డిపాజిట్ కోల్పోయాయని చెప్పారు. 

మొదట్లో పద్మరాజన్ ఎన్నికల్లో పోటీ చేయడంపై భార్యాపిల్లలు వ్యతిరేకించినా అతని వైఖరి మారకపోవడంతో వారు కూడా అంగీకరించారు. 200 సార్లు పోటీ చేయాలనుకుంటున్న పద్మరాజన్ రాహుల్ గాంధీపై కూడా పోటీ చేయాలని ఉందని వ్యాఖ్యానించారు.