గాడ్సే విషయంలో సినీనటుడు, మక్కల్ నీది మయ్యమ్ నేత కమల్ హాసన్‌కు ముందస్తు బెయిల్ మంజూరైంది. తమిళనాడులోని అవరకురిచ్చిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సేనే భారత్‌లో తొలి హిందూ ఉగ్రవాది అంటూ కమల్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి.

దీనిపై బీజేపీ సహా ఇతర పక్షాలు సైతం లోక నాయకుడిపై మండిపడ్డాయి. ఈ క్రమంలో ఓ హిందూ సంస్థకు చెందిన కార్యకర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మతపరమైన విశ్వాసాలను ప్రేరేపించడం, భిన్న గ్రూపులకు చెందిన వారి మధ్య శత్రుత్వాన్ని పెంచడం వంటి అభియోగాలపై 153ఏ, 295ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు..

కాగా, ప్రజల్లో తన ప్రతిష్టను దెబ్బ తీసేందుకు కక్ష సాధింపునకు దిగుతున్నారని కమల్ హాసన్ ఆరోపించారు. గాడ్సేపై తన వ్యాఖ్యలను కమల్ సమర్థించుకున్నారు. గాంధీ హత్య కేసు విచారణ సందర్భంగా దేశ విభజనకు కారణమైన గాంధీని హిందువైన తాను చంపానని గాడ్సే స్వయంగా అంగీకరించారని ప్రస్తావించారు.

తాను గాంధీని ఎందుకు చంపాను అనే పుస్తకంలో సైతం గాడ్సే ఇదే విషయం చెప్పారని అన్నారు. ముందస్తు బెయిల్‌ కోసం కమల్ హాసన్ మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.