ఇటీవల సర్జికల్ స్ట్రైక్స్ పై చేసిన కామెంట్స్ పై వివాదం కొనసాగుతుండగానే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు యడ్యూరప్ప మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలను బట్టి కర్ణాటక లో జెడిఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వ భవిష్యత్ ఆధారపడి వుందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలోని మొత్తం 28 లోక్ సభ స్ధానాలకు గాను 22 స్థానాల్లో బిజెపి గెలిచినా ఈ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని యడ్యూరప్ప సంచలనానికి తెరలేపారు.

కేంద్ర ఎన్నికల సంఘం లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో కర్ణాటక బిజెపి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా జరిగిన ఓ బహిరంగ సభలో యడ్యూరప్ప మాట్లాడుతూ...లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు ఆశిర్వదిస్తే కేంద్రంలోనే కాదు రాష్ట్రంలో కూడా తమ ప్రభుత్వమే ఏర్పడుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కనీసం 22 మంది ఎంపీలు గెలిస్తే కేవలం 24 గంటల్లోనే ప్రస్తుత ప్రభుత్వాన్ని కూల్చి బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. 

దేశ వ్యాప్తంగా మరోసారి బిజెపి ప్రభంజనం ఖాయమని...300వందలకు పైగా ఎంపీలను గెలుస్తామన్న ప్రధాని మాటలను యడ్యూరప్ప గుర్తుచేశారు. ఆయన చెప్పినట్లు జరగాలంటే కర్ణాటక బిజెపి నాయకులు కూడా శక్తివంచన లేకుండా కృషిచేయాలన్నారు. కర్ణాటక లోక్ సభ ఎన్నికల్లో బిజెపి స్వీప్ చేయాలని కోరుకుంటున్నట్లు యడ్యూరప్ప తెలిపారు.