ఎన్నికల నేపథ్యంలో చాలా మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను సైతం వదులుకుని అభిమాన పార్టీ, నేతల తరపున ప్రచారం చేస్తున్నారు. కొందరైతే ఏకంగా ఎన్నికల బరిలో సైతం నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

తాజాగా ఓ వ్యక్తి బీజేపీకి ప్రచారం చేసేందుకు సెలవివ్వలేదనే కారణంతో ఏకంగా ఉద్యోగానికి రాజీనామా చేశాడు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం మంగళూరు తాలుకా సూరత్కల్‌కి చెందిన సుధీంద్ర హెబర్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ విమానాశ్రయంలో స్క్రీనింగ్ అధికారిగా పనిచేస్తున్నాడు.

కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండటంతో ఈ నెల 5 నుంచి 12 వరకు సెలవుపెట్టి ఇండియా వచ్చి.. బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. దక్షిణ కన్నడ నియోజకవర్గంలో ఈ నెల 18న ఎన్నికల పోలింగ్ జరగనుంది.

దీంతో మరో ఆరు రోజుల పాటు సెలవును పొడిగించాలని సుధీంద్ర ఉన్నతాధికారులను కోరాడు. అయితే అతని డిమాండ్‌ను అధికారులు తిరస్కరించారు. దీంతో సుధీంద్ర ఉద్యోగానికే రాజీనామా చేసేశాడు.

దేశం బాగుపడాలంటే నరేంద్రమోడీ మరోసారి ప్రధాని కావాల్సిన అవసరం ఉందని ఎన్నికల తర్వాత తిరిగి సిడ్నీ వెళ్తానని చెప్పాడు. తన కుటుంబ సభ్యులు ఆస్ట్రేలియాలోనే ఉన్నారని.. అక్కడికి వెళ్లాకా మరో ఉద్యోగంలో చేరతానని తెలిపాడు. గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా సుధీంద్ర సిడ్నీ నుంచి వచ్చి పోలింగ్‌లో పాల్గొన్నారు.