దేశ వ్యాప్తంగా రెండో దశ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమయ్యింది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి సామాన్య ప్రజలతో పాటు.. సెలబ్రెటీలు కూడా మందుకు వస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి క్యూలైన్‌లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

నటుడు, రాజకీయనాయకుడు కమల్‌హాసన్‌ ఆయన కుమార్తె శృతి హాసన్‌లు సైతం ఓటు హక్కు వినియోగించుకోవటానికి సాధారణ పౌరులతో పాటు క్యూలైన్‌లో నిల్చున్నారు. మధురైలో ఉత్సవాల కారణంగా రాత్రి 8గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి.

కాంగ్రెస్‌ నేత చిదంబరం భార్య నలిని చిదంబరం, కుమారుడు కార్తి చిదంబరం ఆయన భార్య శ్రీనిధి రంగరాజన్‌ కారైకుడిలోని శివగంగలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల కారణంగా తమిళనాడులో సినిమా ధియేటర్లు మూతపడ్డాయి. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ బెంగళూరులోని జయానగర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని పలు పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించటం కారణంగా పోలింగ్‌ ఇంకా ప్రారంభంకాలేదు.