దేశంలో సార్వత్రిక ఎన్నికల హీట్ పెరిగిపోయింది. విజయం సాధించేందుకు అన్ని ప్రధాన పార్టీలు వ్యూహా, ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. మరోవైపు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కూడా కసరత్తు చేస్తోంది.

ఈ నేపథ్యంలో అసలు దేశంలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వ్యక్తి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో మొట్టమొదటి సారి ఓటు వేసిన వ్యక్తి హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన శ్యామ్ శరణ్ నేగి.

1951లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో శ్యామ్ దేశంలో అందరికంటే ముందుగా ఓటు వేసి భారత తొలి ఓటరుగా రికార్డుల్లోకి ఎక్కారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కన్నౌర్ జిల్లా కల్పా గ్రామానికి చెందిన శ్యామ్ .. 1917 జూలై 1న జన్మించారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1951లో తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 1951 అక్టోబర్ నుంచి 1952 ఫిబ్రవరి వరకు.. మొత్తం 68 దశల్లో పోలింగ్ నిర్వహించారు. వాతవరణ పరిస్థితుల దృష్ట్యా అన్ని రాష్ట్రాల కంటే ముందుగా హిమాచల్ ప్రదేశ్‌‌‌లో ఎన్నికలు నిర్వహించారు.

రాష్ట్రంలోని కిన్నౌర్ జిల్లాలో తొలి పోలింగ్ జరిగింది. వృత్తి రీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయిన శ్యామ్ శరణ్ తొలి ఎన్నికల్లో విధుల్లో పాల్గొన్నారు. అయితే విధులకు హాజరయ్యేందుకు మరో ప్రాంతానికి వెళ్లాల్సి రావడంతో ఆయన ముందుగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

దీంతో దేశంలో తొలిగా ఓటు హక్కును వినియోగించుకున్న వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కారు. అయితే శ్యామ్ శరణ్‌ ఘనత గురించి 2007 వరకు దేశంలో ఎవరికీ పెద్దగా తెలియదు. 2007 జూలైలో మనీశా నందా అనే ఐఏఎస్ అధికారిణి తొలిసారిగా శ్యామ్ గురించి తెలుకున్నారు.

90 ఏళ్లు పైబడిన ఓటర్ల గురించి వెతుకుతుండగా.. ఆమె దృష్టి శ్యామ్‌పై పడింది. అప్పటికి ఆయన వయసు 92 సంవత్సరాలు. ఈ క్రమంలో శరణ్ గురించి తెలుసుకోవాల్సిందిగా ఎన్నికల అధికారులను కోరానని ఆమె మీడియాకు తెలిపారు.

ఆ సమయంలో కిన్నౌర్ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారిణి సుధా దేవి.. స్వయంగా శ్యామ్ ఇంటికి వెళ్లి ఆరా తీయగా ఆయన తొలి ఓటు ఎలా వేశారో కుమారుడు తెలిపారు.

దీనిని నిర్థారించేందుకు నాలుగు నెలల పాటు పాత రికార్డులన్నీ తిరగేయగా విషయం వెలుగులోకి వచ్చిందని మనీశా వెల్లడించారు. శ్యామ్ ఈ ఏడాది 103వ పడిలోకి అడుగుపెట్టబోతున్నారు.

ఆయనకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు, మనవళ్లు, మనవరాల్లు ఉన్నారు. 1975లో పదవీ విరమణ చేసిన శ్యామ్ ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.