ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దశల పోలింగ్ ముగిసింది. గత గురువారం రెండోదశ పోలింగ్ లో భాగంగా సూపర్ స్టార్ రజీనీకాంత్ చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అయితే.. ఓటు వేసారనడానికి గుర్తుగా ఎడమ చేతి వేలికి సిరా గుర్తు వేయడం కామన్. అయితే.. రజీనీకాంత్ కి మాత్రం కుడి చేతి వేలికి వేశారు. ఓటు వేసిన అనంతరం పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చాక ఆయన తన వేలిని ప్రజలకు చూపిస్తూ.. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

ఆయన ఎడమచేతికి ఉండాల్సిన సిరా గుర్తు.. కుడి చేతికి ఉండటాన్ని కొందరు గమనించారు. వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సత్యప్రద సాహు దీనిపై జిల్లా ఎన్నికల అధికారిని వివరణ కోరారు. 

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధన మేరకు ఎడమ చేతి వేలుకు సిరా గుర్తు వేయాలన్నారు. ఇలా కుడిచేతి వేలుకు వేయడం పొరపాటేనని చెప్పారు. ఇది ఎవరి తప్పో తెలియదని, దీనిపై వివరణ కోరినట్లు వెల్లడించారు. 2016 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా రజనీకాంత్‌ ఏ పార్టీకి ఓటు వేస్తున్నది తెలిసేలా వ్యవహరించారనే వీడియో దుమారం రేపింది.