తన ప్రాణాలకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాల్సిందిగా కోరారు కాంగ్రెస్ నాయకుడు, పాటిదార్ రిజర్వేషన్ ఉద్యమనేత హార్డిక్ పటేల్.

శుక్రవారం ఎన్నికల ప్రచారసభలో ఓ వ్యక్తి తన చెంప చెళ్లుమనిపించడం, ఆ మరుసటి రోజు తోపులాట ఘటన చోటు చేసుకోవడం చూస్తే తన ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు కనిపిస్తోందని, ఆదివారం జామ్‌నగర్‌లో నిర్వహించే రోడ్‌షో సందర్భంగా తనకు తగినంత పోలీస్ భద్రత కల్పించాలని జామ్‌నగర్‌ జిల్లా ఎస్పీకి లేఖలో హార్డిక్ కోరారు.

రోడ్‌షోలో సంఘ వ్యతిరేక శక్తులు తనపై దాడి చేసి అవకాశం ఉందని హార్డిక్ ఆందోళన వ్యక్తం చేశారు. జామ్‌నగర్ రూరల్‌లో ఈ నెల 21వ తేదీ ఉదయం 9 గంటలకు రోడ్‌షోలో పాల్గొంటున్నానని .. అక్కడ ఉన్నంత సేపు తనకు తగినంత పోలీస్ రక్షణ కల్పించాల్సిందిగా హార్దిక్ ఎస్పీని కోరారు.

ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన తాజా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉన్నప్పటికీ... 2015లో మెహసానా అల్లర్ల కేసులో తనను దోషిగా నిర్ధారించడంపై స్టే ఇవ్వాలని చేసుకున్న విజ్ఞప్తిని రాష్ట్ర హైకోర్టు తిరస్కరించడంతో హార్డిక్ పోటీ నుంచి విరమించుకున్నారు.