ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల సమరం నడుస్తోంది. ఇప్పటి వరకు రెండు దశల పోలింగ్ ముగిసింది. కాగా.. వీటి ఫలితాలు మే23వ తేదీన వెలువడనున్నాయి. ఈ సంగతి పక్కనపెడితే.. ప్రముఖ ఫుడ్ డెలీవరీ యాప్ స్విగ్గీలో పనిచేసే ఓ డెలవరీ బాయ్.. ఇప్పుడు ఎన్నికల బరిలో నిలిచాడు. అతని పేరు జెనిఫర్ జే రస్సెల్. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలోని 22 మంది అభ్యర్థుల్లో ఈయన ఒకరు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. 

జెనిఫర్ జే రస్సెల్ కేరళకు చెందిన వ్యక్తి. ఊరు తిరువనంతపురం. ఇంజనీరింగ్ పూర్తి చేశారు. కార్పొరేట్ సెక్టార్‌లో టెలికం ఇంజినీర్‌గా ఉద్యోగం చేసేవారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకునేందుకు తన ఉద్యోగాన్ని వదిలేశారు. కేరళలో ట్రాఫిక్ పోలీస్ వార్డెన్‌‌గా పనిచేశారు. తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో డిప్యూటీ మేనేజర్‌గా చేరారు. అటుపైన ఉబెర్‌లో డ్రైవర్‌గా చేశారు. తర్వాత ఈ జాబ్ కూడా వదిలేసి స్విగ్గీలో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశాడు. 

బెంగళూరు ప్రజల కోసం మంచి చేయాలనే ఉద్దేశంతో తాను ఈ ఎన్నికల బరిలో నిల్చున్నట్లు అతను వివరించాడు. తాను ప్రజల కష్టాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించానని.. తనను గెలిపిస్తే.. వారి సమస్యలకు పరిష్కారం చూపెడతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.