ఎన్నికలు పూర్తయ్యే కొద్ది బీజేపీ, బీఎస్పీల మధ్య మాటల యుద్ధం పెరిగిపోతోంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీ, బీఎస్పీ చీఫ్ మాయావతిలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ గొడవలోకి బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ వచ్చి చేరారు.

ప్రధాని నరేంద్రమోడీపై బీఎస్పీ చీఫ్ మాయావతి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు . మోడీపై వ్యక్తిగత  విమర్శలకు దిగిన మాయావతి ప్రజా జీవితానికి అనర్హురాలని జైట్లీ ఘాటుగా సమాధానమిచ్చారు. మాయపై వరుసగా ట్వీట్లతో విరుచుకుపడ్డారు.

దళిత  మహిళకు జరిగిన అన్యాయంపై స్పందించని మోడీ.. పార్టీలోని మహిళా నేతలకు ఎలా గౌరవం ఇస్తారని ఆమె నిలదీశారు. మోడీ ప్రభుత్వం పనికిమాలిన రాజకీయాలు చేస్తుందని.. రాజకీయాల్లోకి లబ్ధి పొందేందుకే అల్వార్ ఘటనపై మోడీ స్పందించడం లేదని మాయ పేర్కొన్నారు.

అంతేకాకుండా తన భార్యకు దూరంగా ఉంటున్న ప్రధాని మోడీ.. తమ భర్తల  నుంచి ఎక్కడ దూరం చేస్తారేమోనని బీజేపీ మహిళా నేతలు భయపడతున్నారంటూ మాయావతి ఎద్దేవా చేశారు.

అంతకు ముందు ప్రధాని మోడీ కూడా మాయావతి మొసలి కన్నీరు కారుస్తున్నారని... నిజంగా చిత్తశుద్ది వుంటే రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్ధతు ఉపసంహరించుకోవాలని ప్రధాని డిమాండ్ చేశారు.