లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బాగంగా మాజీ ప్రధాని, జేడిఎస్ అధినేత దేవెగౌడ కన్నీటిపర్యంతమయ్యారు. తన మనవన్ని లోక్ సభ అభ్యర్థిగా ప్రకటిస్తున్న సమయంలో భావోద్వేగాన్ని ఆపుకోలేక ఆయన కంటతడి పెట్టారు. దీంతో తమ అభిమాన నాయకున్ని అలా చూసిన జేడిఎస్ నేతలు, కార్యకర్తలు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. 

హెచ్‌డి దేవెగౌడ ప్రస్తుతం హసన్ లోక్ షభ స్థానం నుండి ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే వయసు మీద పడటంతో మెల్లిగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరమవుతున్న ఆయన ఇప్పటికే తన వారసులను రాజకీయాల్లోకి దింపగా ఈసారి మనవళ్ల రాజకీయ రంగప్రవేశానికి కూడా రంగం సిద్దం చేశారు. 

ఈ క్రమంలోనే కొడుకు రేవన్న తనయుడు ప్రజ్వల్ ను తాను ప్రాతినిధ్యం వహిస్తున్న స్ధానం నుండి బరిలోకి దింపాలని భావిస్తున్నారు. దీంతో హసన్ పరిధిలోని ముఖ్య నాయకులు, అనుచరులకు అతన్ని పరిచయం చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే హోలెనర్సీపూర్ తాలూకా ముదలహిప్పె గ్రామంలోని కార్యకర్తలో దేవెగౌడ మనువడితో కలిసి సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను ఎంతో మందిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి మంచి భవిష్యత్ కల్సించానని తెలిపారు. అలాంటిది ఇప్పుడు తన కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకొస్తుంటే మాత్రం కొందరు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారనంటూ దూవెగౌడ కన్నీరు పెట్టుకున్నారు. అయితే ఈ సమయంలో పక్కనే వున్న మనువడు ప్రజ్వల్ ఆయన కన్నీటిని తుడిచి  ఓదార్చాడు.