ప్రధాని నరేంద్రమోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూకి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలపై ఆయన 24 గంటల్లోగా సమాధానం చెప్పాలని ఈసీ నోటీసులో పేర్కొంది.

ఏప్రిల్ 29వ తేదీన భోపాల్‌లో జరిగిన ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ... పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి లాభం చేకూర్చేందుకే మోడీ.. రాఫేల్ యుద్ద విమానాల ఒప్పందం కుదుర్చుకున్నారని.. రాజకీయాలను అవినీతిమయం చేశారని ఆరోపించారు.

అమరుల పేరిట రాజకీయాలు చేస్తున్నారని సిద్ధూ విమర్శించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు ఇవి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని సిద్ధూపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఈసీకి ఫిర్యాదు చేశారు.

దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. కాగా ఈ సార్వత్రిక ఎన్నికల సమయంలో సిద్ధూ ఇప్పటికే రెండు సార్లు నోటీసులు అందుకున్నారు.

ముస్లిం ఓటర్లంతా కాంగ్రెస్‌కే ఓటు వేయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను గత నెలలో సిద్ధూ 72 గంటల పాటు ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం ఎదుర్కొన్నారు.