తనపై ఆప్ నేతలు చేస్తున్న ఆరోపణలపై కోర్టులో సమాధానం చెబుతానని మాజీ క్రికెటర్, బీజేపీ అభ్యర్థి గంభీర్ అన్నారు.  తనపై ఆరోపణలు చేస్తున్న ఆప్‌ నేతలకు బీజేపీ ఎంపీ అభ్యర్థి, మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ నోటీసులు పంపించారు.

తనపై ఆప్ నేతలు చేస్తున్న ఆరోపణలపై కోర్టులో సమాధానం చెబుతానని మాజీ క్రికెటర్, బీజేపీ అభ్యర్థి గంభీర్ అన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న ఆప్‌ నేతలకు బీజేపీ ఎంపీ అభ్యర్థి, మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ నోటీసులు పంపించారు. అసత్య ఆరోపణలు చేసినందుకు గానూ వెంటనే క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈ మేరకు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా, ఆప్‌ నేత అతిషిలకు తన లాయర్‌ ద్వారా నోటీసులు పంపించారు.

గంభీర్.. ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టి బీజేపీ తరపున పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఎన్నికల్లో భాగంగా... ఆయనపై ఆప్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఆప్ మహిళా నేత అతిషి ని కించపరిచేలా కరపత్రాలు తయారు చేసి పంపిణీ చేశారంటూ... గంభీర్ పై ఆప్ నేతలు ఆరోపించారు.

ఈ నేపథ్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన ఆతిషి కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో రాజకీయ ప్రత్యర్థిని నేరుగా ఎదుర్కోలేకే గౌతం గంభీర్‌ ఇలాంటి నీచానికి పాల్పడ్డారని, మహిళా అభ్యర్థి పట్ల అనుచితంగా ప్రవర్తించారని అరవింద్‌ కేజ్రీవాల్‌, మనీష్‌ సిసోడియా, ఆతిషి ఆరోపించారు.

కాగా ఈ విషయంపై స్పందించిన గంభీర్‌... ఆతిషిని కించపరుస్తూ పాంప్లెట్లు పంచింది తానేనని నిరూపిస్తే.. ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని సవాల్‌ విసిరారు. ‘ మీరు నిజాలే మాట్లాడి ఉంటే చట్టబద్ధంగా పోరాడండి. నాకు వ్యతిరేకంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే కేసు పెట్టండి. కోర్టులోనే వాటికి సమాధానం చెబుతా’ అని వ్యాఖ్యానించారు.