బీజేపీ మహిళా నేత సాధ్వీ ప్రగ్యా ఠాకూర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. తన శాపం వల్లే ముంబై పేలుళ్ల సమయంలో ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే మరణించారంటూ ప్రగ్యాసింగ్ చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టిన ఆయన.. కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ను శపించి ఉంటే బాగుండేదన్నారు.

తద్వారా భారత్‌కు మెరుపుదాడుల అవసరమే ఉండేది కాదన్నారు. శనివారం భోపాల్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డిగ్గీ రాజా... ఎక్కడ దాక్కున్నా వెంటాడి మరీ ఉగ్రవాదులను వేటాడుతామంటూ ప్రధాని మోడీ చెబుతున్నారని.. మరి పుల్వామా, పఠాన్‌కోట్, ఉరి దాడులు జరిగినప్పుడు ఆయన ఎక్కడున్నారని ప్రశ్నించారు.

దేశంలోని అన్ని మతాలకు చెందిన ప్రజలు తనకు కావాల్సినవారేనని దిగ్విజయ్ అభిప్రాయపడ్డారు. బీజేపీ మాత్రం హిందువులకు ప్రమాదం వుందని, కావున అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు.

భారతదేశాన్ని 500 ఏళ్లు పాలించిన ముస్లిం రాజులు ఏ మతానికీ హానీ తలపెట్టలేదని చెప్పకొచ్చారు. మతం పేరిట రాజకీయ లభ్ది పొందాలని కొందరు ప్రయత్నిస్తున్నారని... వారి వారితో అప్రమత్తంగా ఉండాలన్నారు.

‘హర్ హర్ మహాదేవ్’’ అనే మంత్రాన్ని బీజేపీ ‘హర్ హర్ మోడీ’’ అంటూ అపహాస్యం చేస్తోందని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. ఇది హిందువుల మనోభావాలను కించపరచడమేనన్నారు.