సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారీటి వచ్చే అవకాశం లేకపోవడంతో కాంగ్రెస్, బీజేపీలు మిత్ర పక్షాలను వెతుక్కునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో వైసీపీ చీఫ్ జగన్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సోనియా గాంధీ కూటమిలోకి చేరాల్సిందిగా ఆహ్వానాలు పంపారంటూ గత కొద్దిరోజులుగా మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో ఈ కథనాలపై స్పందించారు కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్. ఈ నెల 23న ఎన్డీయేతర ప్రాంతీయ పార్టీల నేతలు ఢిల్లీకి రావాలంటూ సోనియా గాంధీ ఎలాంటి లేఖ రాయలేదన్నారు.

వైసీపీ, టీఆర్ఎస్ అధినేతలకు సోనియా లేఖలు రాశారంటూ వస్తున్నవన్నీ ఊహాగానాలేనని పటేల్ స్పష్టం చేశారు. ఈ నెల 23న జరిగే కీలక సమావేశం తర్వాతే ఎవరెవరితో కలవాలనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించే అవకాశం ఉందని అహ్మద్ పటేల్ తెలిపారు.