కర్ణాటకలో లోక్ సభ ఎన్నికల సందడి మొదలయ్యింది. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కూటమి(కాంగ్రెస్, జేడిఎస్), ప్రతిపక్షం(బిజెపితో) నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడి...చివరకు జేడిఎస్ తో కలిసి కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఇదే మైత్రిని కొనసాగిస్తూ లోక్ సభ ఎన్నికల్లో కూడా కర్ణాటకలో అత్యధిక ఎంపీ సీట్లను సాధించాలని ఇరుపార్టీలు భావిస్తున్నాయి. 

అందుకోసం ముఖ్యమంత్రి కుమార స్వామి కాంగ్రెస్ పెద్దలతో లోక్ సభ సీట్ల పంపకాలపై చర్చలు ప్రారంభించారు. రాష్ట్రంలోని 28 ఎంపీ స్థానాల్లో గెలుపు గుర్రాలను మాత్రమే బరిలోకి దింపాలని...ఈ విషయంతో ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకూడదని జెడిఎస్ భావిస్తోంది. అందుకోసం తాము ఓ మెట్టు దిగడానికి కూడా సిద్దమేనని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. 

జెడిఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. లోక్ సభ సీట్ల పంపకాల విషయంలో తమ పార్టీ పట్టువిడుపులకు సిద్దంగా వుందన్నారు. తాము కోరినన్ని సీట్లు కావాలని మంకుపట్టు పట్టుకోమని... కాస్త అటుఇటుగా అయనా సర్దుకుపోడానికి సిద్దంగా వున్నామని ప్రకటించారు. అయితే తాము బలంగా వున్న స్థానాలను వదులుకుండా కాంగ్రెస్ ను ఒప్పించడానికి ప్రయత్నిస్తామన్నారు.  

తాము ముందుగానే ఎలాంటి వివాదాలు ఉండకూడదనే తక్కువ ఎంపీ స్ధానాలనే కోరుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు సీట్ల పంపకాల విషయంలో తమ చివరి నిర్ణయాన్ని కాంగ్రెస్ తెలియజేశామన్నారు. ఆ పార్టీ కూడా కాస్త పట్టువిడుపు దోరణితో ఆలోచించి తుది నిర్ణయం తీసుకుంటే బావుంటుందని సూచించారు. అలాగే జరుగుతుందని అనుకుంటున్నట్లు దేవె గౌడ తెలిపారు. 

మొత్తంగా కర్ణాటక పరిధిలోని 28 లోక్ సభ స్థానాల్లో జేడిఎస్ 12 స్థానాలు కేటాయించాలని కోరుతోంది. కానీ కాంగ్రెస్ మాత్రం పదికంటే తక్కువ సీట్లు మాత్రమే జెడిఎస్ కు ఇవ్వడానికి ఆసక్తి చూసుతోంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య చర్చలు రసవత్తరంగా సాగుతున్నాయి.