బాలీవుడ్ నటి, బీజేపీ నేత హేమామాలిని లోక్‌సభ ఎన్నికల్లో మధుర పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యక్ష ఎన్నికల్లో తన సత్తా చూపించాలని భావిస్తున్న ఆమె ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు.

మొన్నటికి మొన్న పొలంలో కోత కోసిన హేమ.. ప్రచారంలో వెరైటీగా ముందుకు వెళుతున్నారు. తాజాగా ఓ మహిళతో ఆమె దిగిన ఫోటో నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే హేమామాలిని ఎప్పటికప్పుడు ప్రచారానికి సంబంధించిన ఫోటోలను ఆన్‌లైన్‌లో ఉంచుతున్నారు.

సోమవారం హేమామాలిని రోడ్డుపై వెళుతుండగా ఓ వృద్ధురాలు తన తలపై కట్టెల మోపును పెట్టుకుని మోస్తున్నారు. వెంటనే కారు ఆపి మరి కిందకి దిగిన డ్రీమ్ గర్ల్ సదరు వృద్ధురాలితో ఫోటో దిగారు.

అక్కడితో ఆగకుండా వెంటనే దానిని సోషల్ మీడియాలో పెట్టారు. ఇది చూసి నెటిజన్లు హేమామాలినిపై ఫైరయ్యారు. ప్రధాని నరేంద్రమోడీ ఉజ్వల్ యోజన పథకం కింద ప్రతి ఇంటికి వంటగ్యాస్ సదుపాయాన్ని కల్పించామని చెబుతుంటారు.

అయితే ఈ మహిళ వంట చెరకును ఎందుకు మోసుకెళుతోందని ప్రశ్నించారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో అనంతరం ఉజ్వల్ యోజన బండారం బయటపెట్టిన హేమామాలిని అంటూ కామెంట్లు పెట్టారు.