2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోనే ఎన్డీయేదే విజయమని ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో తేలడంతో కమలనాథులు ఖుషీ ఖుషీగా ఉన్నారు.

దేశవ్యాప్తంగా కాషాయ శ్రేణులు ఎగ్జిట్ పోల్స్ విడుదలైన తర్వాత సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా మంగళవారం రాత్రి విందు ఇవ్వనున్నారు.

ఎగ్జిట్ పోల్స్‌తో ప్రజలంతా మోడీ పాలనకు జేజేలు పలికారని, అంకిత భావంతో సుపరిపాలన అందించిన మోడీ సర్కార్‌కు సానుకూలంగా ప్రజలు ఓట్లు వేసినట్లుగా వెల్లడైందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. అసత్య ఆరోపణలు, అవాస్తవాలను ప్రచారంలో పెట్టిన విపక్షాలకు ఎగ్జిట్ పోల్స్‌ ఓ గుణపాఠమని అన్నారు.

మరోవైపు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కట్టుకథలని.. మే 23న అసలైన ఫలితాలు రానున్నాయని..ఎగ్జిట్ పోల్స్ సర్వేలను తాను విశ్వసించనని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఫలితాల రోజున ప్రజలంతా విపక్షాల వైపు నిలబడినట్టుగా స్పష్టంగా వెల్లడవుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.