అఖిలేశ్, మాయావతి, కాంగ్రెస్‌పై బీజేపీ చీఫ్ అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ... మహాకల్తీ కూటమి నేతలు దేశం గురించి మాట్లాడుతున్నారని.. దేశ భద్రత విషయంలో బీజేపీ అలసత్వం ప్రదర్శించదన్నారు.

పాక్ నుంచి ఒక్క తూటా దూసుకువస్తే.. ఇక్కడి నుంచి అక్కడ బాంబును వేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విభజించాలని చూస్తొందని.. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రధాని కావాలని ఒమర్ అబ్ధుల్లా అడుగుతున్నారని.. దీనిపై రాహుల్ బాబా మౌనం పాటిస్తున్నారని అమిత్ షా ఎద్దేవా చేశారు.

జమ్మూకశ్మీర్ ఎప్పటికీ దేశంలో ఒక భాగమేనని.. పాకిస్తాన్‌లోకి ప్రవేశించిన మన భద్రతా బలగాలు.. ఉగ్రవాదులను హతమార్చితే కాంగ్రెస్ నేతలు బాధపడిపోతున్నారని.. ఆ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.  

55 ఏళ్ళపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పూర్వాంచల్‌ను అభివృద్ధి చేయలేదని అమిత్ షా ఆరోపించారు. మోడీ ప్రధాని అయ్యాకా ఈ ప్రాంతంలో వేగంగా అభివృద్ధి అవుతుందన్నారు.