సార్వత్రిక ఎన్నికలు గురువారం ఉదయం 7గంటల నుంచి ప్రారంభమైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రజలు తమ ఓటు హక్కును భారీ సంఖ్యలో వినియోగించుకోవాలని మోడీ, షాతోపాటు పలువురు ప్రముఖులు ఓటర్లకు పిలుపునిచ్చారు.

‘నేడు 2019 లోక్‌సభ ఎన్నికలు. తొలి దశ పోలింగ్ జరుగుతున్న స్థానాల్లో ప్రజలు రికార్డు స్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. తొలిసారి ఓటు వేసేవారు, యువత పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవాలి ’ అని ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. 

 

గురువారం ఉదయం 11 గంటల వరకు వివిధ రాష్ట్రాల్లో నమోదైన ఓటింగ్ శాతం.

‘బలమైన, విజనరీ, విశ్వాసం కలిగిన నాయకత్వం మాత్రమే పక్షపాతం లేకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజల అభివృద్ధికి కృషి చేస్తుంది. లక్షద్వీప్, అండమాన్, నికోబార్ ద్వీపాల ఓటర్లు అధిక సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నా’ అని షా వ్యాఖ్యానించారు.

మరో ట్వీట్‌లో ‘ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కొనసాగాలంటే.. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర సోదరసోదరీమణులు భారీ సంఖ్యలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి’ అని అమిత్ షా పిలుపునిచ్చారు.

హోంమంత్రి రాజ్‌నాథ్ కూడా ఎన్నికల వేళ ఓటర్లకు సందేశం ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో నేడు 91 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయని.. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఈ ప్రజాస్వామ్య పండగలో పాల్గొనాలని హోంమంత్రి కోరారు. 

అరుణాచల్‌ప్రదేశ్ ఓటర్లు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో భారీ సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని హోంమంత్రి కిరణ్ రిజుజు ట్వీట్ చేశారు. పోలింగ్ జరుగుతున్న దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 

లోక్‌సభ ఎన్నికలు మొత్తం 7దశల్లో జరుగుతున్నాయి. గురువారం 18 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 91స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. చివరి దశ పోలింగ్ మే 19న జరగనుంది. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.