దేశానికి ప్రధాని మోడీ పెద్ద ప్రమాదమని.. ఆయన అభివృద్దికి అడ్డుపడతారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన జేడీఎస్-కాంగ్రెస్ తరపున కర్ణాటకలోని కొప్పల్‌లో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధానిపై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రధాని నరేంద్ర మోడీ మోసం చేశారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని బాబు ధీమా వ్యక్తం చేశారు.

మోడీ పాలనలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు పోయాయని, ఆర్ధిక అసమానతలు పెరిగిపోయాయన్నారు. పెద్దనోట్ల రద్దు వల్ల అభివృద్ధి ఆగిపోయిందని, ఏటీఎంలు, బ్యాంకుల్లో డబ్బులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. జీఎస్టీతో వ్యాపారులు దెబ్బతిన్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

సీబీఐ, ఐటీ, ఈడీ లాంటి సంస్థలను మోడీ నాశనం చేశారని.. ప్రతిపక్షనేతలపై ఐటీ దాడులు చేయిస్తున్నారని సీఎం ఆరోపించారు. 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని తామంతా పోరాడుతున్నామని.. సుప్రీంకోర్టుకే తప్పుడు అఫిడవిట్లు సమర్పించిన వాళ్లు ఎంతకైనా తెగిస్తారన్నారు.