సినీ నటి సుమలతను ఓడించేందుకు కుట్ర జరుగుతుందా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. సుమలత కర్ణాటక లోని మాండ్యా నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన సంగతి తెలిసిందే. మొదట ఆమె కాంగ్రెస్ నుంచి ఆ సీటుకి పోటీ చేయాలని భావించారు. అయితే.. కాంగ్రెస్-జేడీఎస్ పొత్తులో భాగంగా ఆ సీటు నుంచి సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ పోటీకి దిగారు. దీంతో.. ఆమెకు టికెట్ దక్కలేదు. కాగా.. ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచారు.

అయితే.. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆమెను ఓడిచేందుకు కుట్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. సుమలత పేరుతో ఆమె కాకుండా మరో ముగ్గురు మహిళలు అదే నియోజకవర్గం నుంచి పోటీకి దిగడం గమనార్హం.

సుమలత అంబరీష్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌లో భాగంగా తాను ఎస్‌ఎస్‌ఎల్‌సీ పాసయ్యానని పేర్కొన్నారు. కాగా ఎం. సుమలత(భర్త పేరు- మంజె గౌడ) విద్యార్హత ఎనిమిదో తరగతిగా పేర్కొనగా, సుమలత(భర్త పేరు- సిద్దె గౌడ) ఏడో తరగతి వరకు చదివినట్లుగా పేర్కొన్నారు. వీరితో పాటుగా మరో సుమలత(భర్త పేరు- కె.దర్శన్‌) పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 

 ఈ విషయం గురించి సుమలతా అంబరీష్‌ మాట్లాడుతూ..‘ వాళ్లు ఇలాంటి గిమ్మిక్కులకు పాల్పడతారని ముందే తెలుసు. నన్ను ఓడించడానికి వారు వేసిన ఎత్తుగడ. నేను కూడా వారిలా చేయవచ్చు కానీ అది నాకు నచ్చదు. నేరుగా, న్యాయంగా ‘యుద్ధం’ చేసి గెలవాలనుకుంటున్నా. వాళ్లలా దొంగచాటు రాజకీయాలు నాకు చేతకావు అని వ్యాఖ్యానించారు.