న్యూఢిల్లీ: తెలంగాణ లోకసభ ఎన్నికల్లో 16 సీట్లను గెలుచుకోవాలనే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కోరిక నెరవేరేట్లు లేదు. తెలంగాణలో మొత్తం 17 లోకసభ స్థానాలుండగా, టీఆర్ఎస్ కు 13 సీట్లు వస్తాయని టైమ్స్ నౌ - విఎంఆర్ ఓపినియన్ పోల్ అంచనా వేసింది. 

టీఆర్ఎస్ 41.2 శాతం ఓట్లతో 13 సీట్లను గెలుచుకుంటుందని టైమ్స్ నౌ - విఎంఆర్ సర్వే తేల్చింది. కాంగ్రెసుకు 30.3 శాతం ఓట్లు పోలవుతాయని, అయినప్పటికీ 1 సీటు మాత్రమే గెలుచుకుంటుందని అంచనా వేసింది. 

బిజెపి 2 సీట్లలో విజయం సాధించే అవకాశాలున్నాయని ఓపినియన్ పోల్ తెలియజేసింది. బిజెపికి 17.6 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. ఇతరులు అంటే, మజ్లీస్ 1 స్థానం గెలుచుకుంటుందని, 10.90 శాతం ఓట్లు పోలవుతాయని తేల్చింది. 

2014 ఎన్నికలతో పోలిస్తే టీఆర్ఎస్ ఓట్ల శాతం పెరడం వల్ల ఒక్క సీటు అదనంగా గెలుచుకుంటుందని అంచనా వేసింది. 2014లో 34.7 శాతం ఓట్లతో 12 సీట్లను గెలుచుకుంది. 

అయినప్పటికీ కేంద్రం చక్రం తిప్పేందుకు కేసీఆర్ కు అవకాశం ఉంటుందని టైమ్స్ నౌ వ్యాఖ్యానించింది. ఎన్డీఎకు మెజారిటికి 21 సీట్లు తక్కువ పడుతాయని, ఈ స్థితిలో కేసీఆర్ తృతీయ ఫ్రంట్ ప్రయత్నాలకు ఊపు వస్తుందని విశ్లేషించింది.