అల్లు అర్జున్ అల వైకుంఠపురములో...: పోతన రసాత్మక పద్యం గురించి..
త్రివిక్రమ్ అల్లు అర్జున్ హీరోగా తీస్తున్న సినిమాకు అల వైకుంఠపురములో అని టైటిల్ పెట్టగానే ఒక్కసారిగా బమ్మెర పోతన రాసిన భాగవతం గజేంద్ర మోక్షం ఘట్టంలోని పద్యం గుర్తుకు రావడం యాదృచ్ఛికమేమీ కాదు.
త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న అల వైకుంఠపురములో.. టైటిల్ ప్రాచీన కవి బమ్మెర పోతన పద్యాన్ని గుర్తు చేస్తోంది. నిజానికి, త్రివిక్రమ్ ఆ టైటిల్ ను అక్కడి నుంచే తీసుకుని ఉంటారు. పోతన పద్యం అల వైకుంఠపురంబులో అని మొదలవుతుంది. దాన్ని త్రివిక్రమ్ అల వైకుంఠపురములో అని మార్చుకున్నారు.
'రాములో రాములా' యూట్యూబ్ ని ఆగం చేసేలానే ఉంది!
పోతన రాసిన భాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టం అత్యంత రసాత్మకమైంది. భాగవత పద్యాలు తెలుగు ప్రజల నోళ్లలో ఇప్పటికీ నానుతూ ఉంటాయి. ఆయన పద్యాల్లోని మాధుర్యం అది. గజేంద్రుడు (బలమైన ఏనుగు) వనవిహారం, జలవిహారం చేస్తూ వినోద కార్యక్రమాల్లో మునిగితేలుతూ ఉంటుంది. ఏయితే ఒసారి జలవిహారం చేస్తున్నప్పుడు మొసలి దాన్ని పట్టుకుంటుంది. ఏళ్ల తరబడి ఏనుగు మొసలితో పోరాడుతూ ఉంటుంది. మొసలి నుంచి రక్షించుకోలేకపోతుంది. అటువంటి స్థితిలో ధైర్యం కోల్పోయి భగవంతున్ని ఇలా ప్రార్థిస్తుంది.
లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యె, ప్రాణంబులున్
ఠావుల్ దప్పెను, మూర్ఛవచ్చె, తనువున్ డస్సెన్, శ్రమంబయ్యెడిన్
నీవే తప్ప ఇతఃపరంబెరుగ మన్నింపందగున్ దీనునిన్
రావే యీశ్వర! కావవే వరద! సంరక్షించు భద్రాత్మకా!
ఈ పద్యం తర్వాతనే అలవైకుంఠపురంబులో అనే పద్యం వస్తుంది. గజేంద్రుడి మొర శ్రీమహా విష్ణువుకు వినిపిస్తుంది. అప్పుడు ఆయన ఏ స్థితిలో ఉన్నాడనేదే అల వైకుంఠపురంబులో పద్యం..
అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహిపాహి యనఁ గుయ్యాలించి సంరంభియై.
బన్నీ సెంటిమెంట్ లుక్.. టీజర్ లో గట్టిగా వాడేశాడు!
వైకుంఠపురములో భార్యతో వినోదిస్తున్న సమయంలో గజేంద్రుడి పాహిపాహి (రక్షించు, రక్షించు) అనే మొర ఆయన చెవిలో పడుతుంది. దాంతో ఆయన గజేంద్రుడిని రక్షించడానికి ఎలా వస్తాడంటే...
సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే
పరివారంబునుఁ జీరఁ డభ్రగపతిం బన్నింపఁ డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాద ప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై
లక్ష్మీదేవికి చెప్పలేదు, శంఖ చక్రం తీసుకోడు.. అంటూ విష్ణువు గజేంద్రుడిని రక్షించడానికి ఎలా వచ్చాడనే విషయాన్ని పోతన తన పద్యంలో చెప్పాడు.
ఈ మూడు పద్యాలు కూడా సాధారణ వ్యవహారంలో ఏదో రకంగా ఉపయోగంలో ఉంటూనే ఉన్నాయి. ఈ పద్యాలకు త్రివిక్రమ్ సినిమా కథకు ఏమైనా సంబంధం ఉందో లేదో తెలియదు గానీ ఆయన ఒక్కసారి మహాకవి పోతనను మాత్రం గుర్తు చేశాడు.