మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి వస్తున్న చిత్రం 'అల వైకుంఠపురంలో..'. ఇప్పటికే ఈ సినిమాలో ఒక పాటను విడుదల చేయగా.. ఇటీవల సినిమాలో రెండో పాట 'రాములో రాముల' టీజర్ ని వదిలారు.

ఈ పాట లిరిక్స్‌ ను శ్యామ్ రాయగా.. అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. ముప్పై సెకన్లు కూడా లేని ఈ పాట టీజర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. 'రాములో రాములా నన్నాగము చేసిందిరో.. రాములో రాములా నా పాణము తీసింది రో' అంటూ సాగే ఈ పూర్తి పాటను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు.

అల్లు అర్జున్ వాయిస్ తో మొదలైన ఈ పాట అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇప్పటికే విడుదలైన సామజవరగమన పాట టాలీవుడ్ లో రికార్డు సృష్టించింది. అత్యధిక మంది లైక్ చేసిన తెలుగు పాటగా రికార్డు నిలిచింది. ఇప్పుడు 'రాములో రాములా' పాట కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.  

ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు, జయరామ్‌ తదితరులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ ఈ సినిమాను  నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.