డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

దీపోజ్యోతిః పరం బ్రహ్మ, దీపః సర్వతమో పహః |
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే ||

భావం:- దీపం జ్యోతి స్వరూపమైనది. అదే పరంబ్రహ్మం, దీపం చీకటిని పారద్రోలుతుంది. ఈ దీపం వల్లే సర్వకార్యాలు సుగమం అవుతున్నాయి. అటువంటి సంధ్యా దీపమా! నీకు నమస్కారం అని అర్థం. దీపం సర్వవేళలా ఆరాధ్య తేజస్సు. దీపలక్ష్మిగా దీపాన్ని పూజిస్తారు. ఎవరి ఇంట్లో ఎల్లప్పుడూ దీపాలు వెలుగుతూ ఉంటాయో వారే నిజమైన ఐశ్వర్యవంతులని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. అజ్ఞానం = చీకటి, జ్ఞానం = వెలుతురు. మనలోని అజ్ఞానమనే చీకటిని పోగొట్టి జ్ఞానమనే కాంతిని సర్వత్ర ప్రసరింపజేసే పరమాత్మ స్వరూపమే దీపం అని శాస్త్రాలు చెబుతున్నాయి.

దీప అంటే దీపం అని, ఆవళి అంటే వరుస... దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపావళికి ఓ ప్రత్యేకత ఉంది. కొత్త బట్టలు, పిండి వంటలతో పాటు... సాయంత్రం వేళ అందమైన దీపాలు వెలుగుతో ప్రతి ఇల్లు కళకళలాడుతుంది. దీపావళి రోజున ఏ ఇంటి యందు దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో.. ఆ ఇంట మహాలక్ష్మీ ప్రవేశిస్తుందని హిందువుల ప్రగాఢ విశ్వాసం. అటువంటి పుణ్య దిన సాయంసంధ్య కాలమందు లక్ష్మీ స్వరూపమైన తులసీ కోట ముందు మహిళలు తొలుత దీపాలు వెలిగించి. శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామాలతో పూజ చేసి 'చతుర్భుజాం చంద్రరూపా మిందిరా మిందు శీతలామ్ ఆహ్లాద జననీం పుష్టిం శివాం శివకరీం సతీమ్" అని ధ్యానించి. తులసీ పూజానంతరం గృహమంతా దీపాలంకృతం చేయడం వల్ల మహాలక్ష్మి కాలి అందియలు ఘల్లుఘల్లుమని ఆ గృహంలో నివాసముంటుందని విశ్వాసం.

తైలే లక్ష్మీ ర్దలే గంగా దీపావళి తిధౌ వసేత్‌
అలక్ష్మీపరిహారార్థం తైలాభ్యంగో విధీయతే|| 

దీపావళినాడు నువ్వుల నూనెలో లక్ష్మీయు, అన్నినదులు బావులు, మడుగులులోని నీళ్ళ యందు గంగయు ఉండును కావున ఆనాడు అలక్ష్మి ( దారిద్య్రం ) తొలగుటకు నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయవలెను. దానిచేత గంగాస్నాన ఫలం లభిస్తుంది. నరక భయంగలవారు నివారణకై దీనిని చేయుట శుభము.

దీపములు వెలిగించి అందు లక్ష్మిని ఆహ్వనించి లక్ష్మీపూజ చేయవలెను. దీనివల్ల అలక్ష్మీ నిస్సరణ జరుగుతుంది. లక్ష్మీపూజ చేసిన వారి ఇంట లక్ష్మీ శాశ్వతంగా ఉండవలెననీ బలివరం కోరుకొన్నాడు. అలక్ష్మీ నిస్పరణానికి, డిండిమాదులు వాయించటం, ఉల్కాదానం వీనికి చిహ్నములుగా టపాకాయలు పేల్చి చప్పుడు చేయటం, 'జ్ఞాత్వా కర్మాణి కుర్వీత' తెలిసి చేసినా తెలియక చేసినా ఫలం వస్తుంది. ఆశ్వీయుజ బహుళచతుర్ధశి నరకచతుర్దశి. దీనిని ప్రేత చతుర్ధశి అని కూడా అంటారు.

ఆశ్వయుజ చతుర్దశ్యాం సూర్యోదయాత్పురా
యామినీ పశ్చిమే భాగే తైలాభ్యంగో విధీయతే||

సూర్యోదయానికి ముందు రాత్రి తుదిజాములో ఈ రోజు నువ్వుల నూనెతో అభ్యంగము చేసుకోవలెను. ఇందు వలన కలిగే ప్రభావం ఋషులు దివ్యదృష్టికే గోచరించే రహస్యం. ముఖ్య కాలంలో చేయుటకు వీలు కాకపోతే గౌణకాలంలోనైనా, అనగా సూర్యోదయం తర్వాతనైనా తైలా భ్యంగం చేయాలి. యతులు కూడా అభ్యంగం చేయాలని ధర్మసింధువు చెబుతున్నది. ఉత్తరేణి శిరస్సుపై తిప్పుతూ స్నానం చేయవలెను. దీనివల్ల యమబాధ తప్పుతుంది. త్రిప్పేటప్పుడు మంత్రంపఠిస్తూ త్రిప్పాలి.

శీతలోష్ఠ సమాయుక్త సకంటక దలాన్విత
హరపాప మాపామార్గ భ్రామ్యమాణః పునః పునః||

దున్నిన చాలులోని మట్టిపెళ్ళతో కూడినదీ, ముళ్ళతో నున్న ఆకులు గలదియూ అగు ఓ అపామార్గమా! నిన్ను త్రిప్పుతున్నాను. మాటి మాటికీ త్రిప్పబడి నీవు నాపాపమును హరింపచేయుము అని అర్థము. అపామార్గాన్ని ఉత్తరేణు అని అంటారు. ఇక సాయంకాలం ప్రదోష సమయంలో అన్ని చోట్ల నువ్వుల నూనెతో దీపాలు పెట్టాలి.  

అమావాస్యా చతుర్దశ్యోః ప్రదోషే దీపదానతః|
యమమార్గే దికారేభ్యోముచ్యతే కార్తికే నరః||

ఇక్కడ 'కార్తికే' అన్నమాట పూర్ణిమాంత మాసపక్షము. మన దేశంలో అమావాస్యాంత మాసపక్షం అమలులో ఉన్నందున. మనకిది ఆశ్వీయుజమే. దివిటీలుకొట్టడం దక్షిణదిశగా మగపిల్లలు నిలబడి పితృదేవతలకు త్రోవ చూపుటకుగాను దివిటీలు వెలిగించి చూపవలెను. పిమ్మట పిల్లలు కాళ్ళుకడుగుకొని లోపలికి వచ్చి తీపి పదార్థం తినుట ఆచారము. 

ఈ దీపావళి పండుగ సమయంలో ప్రతి ఒక్కరూ భక్తితో దేవునికి మట్టి దీపాలను వెలిగించండి, కొవ్వత్తులు వద్దు. మహమ్మారి కరోనా బారి నుండి, ఇతర ప్రమాదాలు మరియు సమస్యల నుండి విముక్తిని పొందండి. అలాగే బాణ సంచా కాల్చేటప్పుడు మాస్కులు ధరించండి, శానిటైజర్ కు దూరంగా ఉండండి. శానిటైజర్ పూసుకుని దీపాలు కాని టపాకాయలు కాని కాల్చే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తతో ఉండండి. దైవారాధనను బాణసంచా ద్వారా జరుపుకోవాలని ఏ దేవుళ్ళు కోరుకోరు. స్వచ్ఛమైన విశ్వాసులలో మనసులో భక్తి గొప్పగా ఉంటుంది. డబ్బును టపాకాయలకు వెచ్చించే కంటే ఎక్కువ మట్టి దీపాలను నువ్వుల నూనెతో వెలిగించండి. పేదవారికి తోచిన సహాయం చేసి వాళ్ళ జీవితాలలో ఆనంద జ్యోతులను వెలిగించండి. మనకంటే కింది స్థాయి వారిని ప్రోత్సహించి వారి ముఖంలో అనందానికి మనం కారణమౌతే అదే నిజమైన పండగ జై శ్రీమన్నారాయణ.