రిలేషన్ షిప్ ను కాపాడుకోవాలన్న ఆలోచన రెండు వైపుల నుంచి ఉంటే మీ బంధం బలంగా ఉంటుంది. ఎన్ని సమస్యలొచ్చినా విడిపోవాలన్న ఆలోచన అసలే రాదు.
ప్రేమికులకు ఈ వాలెంటైన్ వీక్ చాలా స్పెషల్. ఈ వారమంతా ఒకరికోసం ఒకరు టైం స్పెడ్ చేస్తారు. ఏకాంతంగా గడుపుతారు. ఎన్నో మధురమైన ఊసులను పోగేసుకుంటారు. మన సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తామని వాగ్దానం చేస్తుంటారు. ఎవ్వరైనా సరే ప్రేమలో పడ్డవారితోనే జీవితాంతం గడపాలని కోరుకుంటారు. ఏ బంధంలోనైనా సరే చిన్న చిన్న అపార్థాలు, గొడవలు చాలా కామన్. వీటినే పట్టుకుని కూర్చుంటే మాత్రం అక్కడితో వారి రిలేషన్ షిప్ కు పుల్ స్టాప్ పడుతుంది. అందుకే ఇలాంటి వాటిని చాలా ఈజీగా తీసుకోవాలి. కూర్చుని మాట్లాడుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు. అయితే వాలెంటైన్స్ వీక్ కదా అని మీరు మీ భాగస్వాములకు ఖరీదైన బహుమతులు ఇవ్వడం, డేటింగ్ ప్లాన్ చేయాల్సిన అవసరమే లేదు. కొన్ని చిట్కాలతో మీరిరువురు మరింత దగ్గర కావొచ్చంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎక్కువ సమయాన్ని గడపండి
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సంబంధంలో ఒకరికొకరు సమయం కేటాయించడం చాలా ముఖ్యం. ఈ సమయమే ఒకరి గురించి ఒకరు పూర్తిగా అర్థం చేసుకోవడానికి, వారి బంధాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అందుకే మీరు ఎంత బిజీగా ఉన్నా.. మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడపండి. ముఖ్యంగా దూరంగా ఉన్నవారికి ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు మాట్లాడకపోతే మీ మధ్య దూరం పెరుగుతుంది. అలాగే ఎన్నో సందేహాలకు దారితీస్తుంది. అలాగని మీరు ప్రతిరోజూ గంటల తరబడి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ రోజులో మీ భాగస్వామి కోసం కొంత సమయాన్ని మాత్రం కేటాయించండి. ఒకరితో ఒకరు మనసువిప్పి మాట్లాడుకోండి.
ఒకరినొకరు నమ్మండి
ఒకరిపై ఒకరికి నమ్మకం ఖచ్చితంగా ఉండాలి. నమ్మకం లేకపోతే మీ మధ్య అనుమానం పుట్టుకొస్తుంది. ఈ అనుమానం భాగస్వామిని ఇబ్బంది పెట్టడంతో పాటుగా, మీ మధ్య దూరం పెరిగిపోతుంది. అందుకే మీ సంబంధంపై నమ్మకంతో ఉండండి. మీకు ఏదైనా విషయం గురించి అనుమానంగా అనిపిస్తే.. నిర్మోహమాటంగా మీ భాగస్వామితో చర్చించండి. కానీ మనసులో దాచుకుని వారిపై ప్రేమ ఉన్నట్టు నటించకండి.
సమస్యల గురించి మాట్లాడండి
రిలేషన్ షిప్ లో దూరం పెరగడానికి ప్రధాన కారణం ఈ జంట ఓపెన్ గా మాట్లాడకపోవడమే అంటున్నారు నిపుణులు. అహం లేదా వాళ్లే క్షమాపణ చెప్పాలి.. అప్పటి వరకు నేను మాట్లాడని పట్టుపడుతుంటారు. కానీ రిలేషన్ షిప్ ను మెయింటైన్ చేయాలంటే సమస్యల నుంచి పారిపోకుండా ఓపెన్ గా మాట్లాడాలి. ఇలా మాట్లాడితేనే మీ రిలేషన్ షిప్ స్ట్రాంగ్ గా ఉంటుంది. మీ మధ్యనున్న అపోహలను తొలగిస్తుంది. అలాగే సంబంధంపై నమ్మకాన్ని పెంచుతుంది.
గతాన్ని తవ్వకండి
గతంలో ఎన్నో జరిగి ఉంటాయి. వాటన్నింటినీ తవ్వుకుని చర్చించుకోవడం లేదా వాటి గురించి గొడవ పడటం వల్ల మీకొచ్చేది ఏమీ ఉండదు. ఇది మీ భాగస్వామికి ఇబ్బందిని లేదా కోపాన్ని కలిగించొచ్చు. పదే పదే పాత విషయాలను మాట్లాడితే మీ మధ్య గొడవలు జరుగుతాయి. ఇది మీ మధ్య దూరాన్ని పెంచుతుంది. అందుకే పాత విషయాల గురించి మాట్లాడకండి.
