ఇంటి చుట్టూ ఎక్కువ చీకటి ఉంటే, అక్కడ లైటింగ్ ఏర్పాటు చేయాలి. వీలైతే మోషన్ సెన్సార్ లైట్లు అమర్చడం మంచిది.
భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలు లేదా అటవీ ప్రాంతాలకు సమీపంలో నివసించే వారికి వర్షాకాలంలో ఇళ్లల్లోకి పాములు రావడం కొత్తేమీ కాదు. తుపానులు, వరదలు వచ్చేటప్పుడు పాములు తమ నివాసాలను వదిలి పొడి, వెచ్చని, సురక్షిత ప్రదేశాలవైపు ప్రయాణిస్తాయి. అటువంటి సమయాల్లో మన ఇళ్లు వాటికి సహజమైన ఆశ్రయ కేంద్రాలుగా మారుతాయి. ఇవి ఎక్కువగా రాత్రిపూట చురుకుగా ఉంటాయి. అందుకే వర్షాకాలంలో ఇంట్లోకి పాములు రావడం, పాముకాటు ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతుంటాయి. ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనాలంటే కొన్ని సరళమైన, కానీ ప్రభావవంతమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
పాములు రాకూడదంటే ఏం చేయాలి?
మొదటగా, పాములు ఇంట్లోకి ప్రవేశించే మార్గాలను పూర్తిగా మూసివేయడం అవసరం. తలుపుల కింద ఖాళీలు, గోడలలో పగుళ్లు, తెరిచిన పైపు రంధ్రాలు, డోర్‌నాబ్ చుట్టూ ఉన్న ఓపెనింగ్లు.. ఇవన్నీ మూసివేయాలి. వర్షాకాలంలో డోర్లు, కిటికీలు గట్టిగా మూసి ఉంచాలి. డోర్ సీల్స్, వైర్ మెష్, సిలికాన్ కార్క్ వంటివి ఉపయోగించవచ్చు. లోతట్టు ప్రాంతాల్లో తలుపుల ముందు ఇసుక సంచులు పెట్టడం వల్ల ఇంట్లోకి నీరు,పాములు ప్రవేశించకుండా ఉండొచ్చు. మీ ఇంటి చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచడం కూడా చాలా ముఖ్యం. చెత్త కుప్పలు, ఆకుల దిబ్బలు, పాత బూట్లు వంటి వాటిని తొలగించి, గడ్డిని తరచూ కోయాలి. కట్టెలను నేల నుండి రెండు అడుగుల ఎత్తులో నిల్వ చేయాలి. పాములు దాచుకునే ప్రదేశాలను ఇష్టపడతాయి కాబట్టి, వీటిని తొలగించడం ద్వారా వాటిని నివారించవచ్చు.
ఇంటి చుట్టూ ఎక్కువ చీకటి ఉంటే, అక్కడ లైటింగ్ ఏర్పాటు చేయాలి. వీలైతే మోషన్ సెన్సార్ లైట్లు అమర్చడం మంచిది. అవి పాములకు అసౌకర్యంగా ఉండి వాటిని భయపెడతాయి. పాములు కొన్ని వాసనలను ఇష్టపడవు. అందుకే రాతి ఉప్పులో వెల్లుల్లిని కలిపి ఇంటి చుట్టూ చల్లి ఉంచాలి. ఇలా చేయడం వల్ల పాములు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.
మీ ఇంటి చుట్టూ మెష్ కంచె వేయడం, అది కొన్ని అంగుళాల భూమిలో పాతిపెట్టడం వల్ల పాములు రావడాన్ని పూర్తిగా అడ్డుకోవచ్చు. ఎలక్ట్రిక్ మీటర్ బాక్స్‌లు, డ్రెయిన్ అవుట్లెట్లు, ఇన్వర్టర్ మూలలు వంటి వెచ్చని ప్రదేశాలను జిప్టైడ్ నెట్‌తో కప్పడం మంచిది. పాములు అక్కడ దాక్కోకుండా ఉంటాయి.
పాము కనపడితే ఏం చేయాలి?
మీరు పామును చూడగానే వెంటనే నెమ్మదిగా వెనక్కి వెళ్లాలి. నిశ్చలంగా ఉండి, పెద్ద శబ్దం చేయకుండా సహాయం కోసం స్థానిక ఫారెస్ట్ అధికారులను లేదా స్నేక్ రెస్క్యూ వాలంటీర్లను సంప్రదించాలి. చీకటిగా ఉన్న ప్రదేశాలలో చెప్పులు లేకుండా అడుగుపెట్టకూడదు. బూట్లు, సంచులు, బట్టలు వాడేముందు పాము ఉందేమో చూసుకోవాలి. ముఖ్యంగా పిల్లలకు ఈ విషయంలో అవగాహన కల్పించాలి. మీ ప్రాంతంలో కనిపించే ప్రధాన పాముల జాతులను తెలుసుకోవడం, వాటిలో ఏవి విషపూరితమైనవో గుర్తించగలగడం కూడా అవసరం.
పామును చంపేందుకు ప్రయత్నించడం ప్రమాదకరం. సరైన శిక్షణ లేకుండా అలాంటి చర్యలు చేయడం వల్ల మనకే ముప్పుగా మారుతుంది. అలాగే డీజిల్ లేదా కిరోసిన్ పోయడం మంచిది కాదు. అవి పర్యావరణానికి హానికరం. ఇంటి చుట్టూ ఎలుకలను ఆకర్షించే బర్డ్ ఫీడర్లు ఉంచకపోవడం మంచిది . ఎందుకంటే ఎలుకలను వెతుక్కుంటూ పాములు వస్తాయి.
మొత్తంగా, వర్షాకాలంలో పాములు రాకుండా ఉండేందుకు పరిశుభ్రత, సరైన అవగాహన చాలా అవసరం. ముందస్తు జాగ్రత్తలతో ముప్పును తగ్గించుకోవచ్చు.