అబ్బాయిల్ని పట్టించుకోండి..ఆ విషయంలో ఛీఛీ అనకూడదు..
శృంగారం గురించి మన దేశంలో బయటకు మాట్లాడటాన్ని తప్పుగా భావిస్తుంటారు. ముఖ్యంగా పిల్లల ముందు మాట్లాడటానికి పెద్దలు అస్సలు అంగీకరించరు.
శృంగారం గురించి మన దేశంలో బయటకు మాట్లాడటాన్ని తప్పుగా భావిస్తుంటారు. ముఖ్యంగా పిల్లల ముందు మాట్లాడటానికి పెద్దలు అస్సలు అంగీకరించరు. ఒకవేళ పిల్లలు దాని గురించి ఏదైనా ప్రశ్నలు రేకెత్తించినా.. సమాధానం చెప్పకుండా దాటేయడం.. లేదా అలాంటి ప్రశ్నలు అడుగుతావా అంటూ కోప్పడటం లాంటివి చేస్తుంటారు. అయితే.. మనం సమాధానం చెప్పకపోతే.. వారికి తెలుసుకునే దారే లేదు అనే భ్రమలో తల్లిదండ్రులు ఉండకూడదు.
తెలిసీ తెలియని వయసులో ఎవరైనా చెబతుంటే వినడం ద్వారానో.. టీవీల్లో చూడటం ద్వారానో పిల్లలకు ఈ అనుమానాలు కలుగుతుంతాయి. ముందుగా పేరెంట్స్ నే అడుగుతారు. వాళ్లు చెప్పకపోతే..బుక్స్, సోషల్ మీడియాలను ఆశ్రయిస్తారు. దాని ద్వారా వారు తప్పుడు దారి పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక వయసు వచ్చాక పిల్లలకు లైంగిక విద్య గురించి తల్లిదండ్రులు కాస్త అవగాహన కల్పించాలంటున్నారు నిపుణులు.
ఎలా లేదన్నా.. ఆడ పిల్లలకు ఎంతోకొంత తల్లి కొన్ని విషయాలను తెలియజేస్తుంది. అమ్మాయిలు రజస్వల దశకు వచ్చేసరికి.. వారికి తల్లులు కొన్ని సూచనలు చేస్తారు. అసలు చిక్కొచ్చి మగపిల్లలతోనే మొదలౌతుంది. ఈ విషయాలు మగపిల్లలకు తల్లులు చెప్పడం కన్నా..తండ్రులు చెప్పడం మేలంటున్నారు నిపుణులు.
అబ్బాయిల్లో ఒక వయసు వచ్చేసరికి వీర్యం ఉత్పత్తి, నిద్రలో ఏర్పడే స్కలనం వంటివి వాళ్లని భయాందోళనలకి గురిచేస్తాయి. ఏ తండ్రీ వీటిని వివరించడు. దాంతో అబ్బాయిలు తమలో తాము ఏవేవో వూహించుకుంటారు. తన సందేహాలు తీర్చుకోవడానికి అశ్లీల చిత్రాలూ చూస్తాడు. సినిమాల్లోని హీరో చేష్టలే నిజమనుకుంటాడు. ఆ భ్రమల్లోనే బ్రతికేస్తుంటారు. తెలిసీ తెలియక తప్పులు చేస్తుంటారు. కాబట్టి ఆ బాధ్యత తండ్రులు తీసుకోవడం ఉత్తమం.