రంజాన్ ఉపవాసం ఉండేవారు చేయాల్సినవి, చేయకూడని పనులు ఇవే..!
Ramadan 2023: ఎక్కువ గంటలు ఉపవాసం ఉండటం చాలా కష్టం. దీనివల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. ఉపవాసం ఉండేవారు పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలని నిపుణులు చెబుతున్నారు.

Ramadan 2023: ఈ ఏడాది ఇస్లామిక్ పవిత్ర మాసం రంజాన్ మార్చి 22న ప్రారంభమవుతుంది. సౌదీ అరేబియాలో రంజాన్ మార్చి 23న ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 21న ఈద్-ఉల్-ఫితర్ ప్రారంభమవుతుంది. చంద్రుడి దర్శనం పవిత్ర రంజాన్ మాసానికి నాంది పలుకుతుంది. ఇస్లామిక్ క్యాలెండర్ లోని తొమ్మిదో నెలలో వచ్చే రంజాన్ ను ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు.
రంజాన్ ఉపవాస ఆచారాలు
పవిత్ర రంజాన్ మాసంలో ఇస్లామిక్ విశ్వాసం ప్రకారం.. ఖురాన్ స్వర్గం నుంచి భూమికి వచ్చిందని నమ్ముతారు. దీన్ని గౌరవించడానికి గుర్తుగా ముస్లింలు ఈ ఉపవాసం ఉంటారు. ప్రజలు తమ ఆత్మలను శుద్ధి చేసుకోవడానికి సర్వశక్తిమంతుడైన అల్లాహ్ దయను పొందడానికి ఈ మాసంలో ఉపవాసం ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఈ పండుగ ఎంతో పవిత్రమైనది. ఉపవాసం ఉండే వారు ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు నుంచి సూర్యాస్తమయం ముగిసే వరకు నెల రోజుల పాటు ఉపవాసం ఉంటారు.
రంజాన్ ఆరోగ్యకరమైన ఆహారం
ఉపవాసం ప్రారంభించడానికి ముందు ముస్లింలు సెహ్రీ లేదా సుహూర్ అని పిలువబడే భోజనాన్ని తింటారు. ఇది వారి శరీరానికి పోషకాలను అందిస్తుంది. ఆహారం లేకుండా ఎక్కువసేపు ఉండటానికి పోషకాహారాన్ని అందించడానికి సహాయపడుతుంది. సాధారణంగా ఇఫ్తార్ అని పిలువబడే విందు భోజనంతో సాయంత్రం పూట ఉపవాసాన్ని విరమిస్తారు. అయితే ఎక్కువ గంటలు ఉపవాసం ఉండటం చాలా కష్టం. అందుకే మీ శరీరానికి అవసరమైన పోషకాలను పొందడానికి ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాలి.
మండే ఎండల్లోనే రంజాన్ వస్తుంది. అందుకే ఆహారంలో పుచ్చకాయ, మస్క్ మెలన్, కీరదోసకాయ, టమోటాలు వంటి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను ఎక్కువగా చేర్చండి. దీంతో మీ శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. అలాగే మీకు ఎక్కువ దాహాన్ని కలిగించే డీప్ ఫ్రైడ్ , ఉప్పుగా ఉండే ఆహార పదార్థాలను అసలే తినకండి.
రంజాన్ రోజా చేయవలసినవి, చేయకూడనివి
పగటిపూట ఉపవాసం ఉన్న వారంతా సూర్యాస్తమయం తర్వాతే తినాలని గుర్తుంచుకోండి. అయితే కొంతమంది వీటిని పాటించాల్సిన అవసరం లేదు. అనారోగ్యంతో బాధపడేవారు, ప్రయాణాలు చేసేవారు, వృద్ధులు, గర్భిణులు, పీరియడ్స్ ఉన్న వారు ఉపవాసం ఉండకూడదు.
ఈ పండుగను కొత్త బట్టలు వేసుకోవడం, నమాజ్ చేయడం, సూర్యాస్తమయం తర్వాత కలిసి భోజనం చేయడం, ఈద్ రోజున 'రంజాన్ ముబారక్' శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు.