సారాంశం

పెళ్లి అనేది జీవితాంతం సాగే ప్రయాణం. ఇందులో ప్రేమతో పాటు చాలా విషయాలు అవసరం. మనం చేేసే కొన్ని పొరపాట్ల వల్ల వివాహబంధంలో తెలియని దూరం వస్తుంటుంది. మరి ఈ దూరాన్ని తగ్గించి పెళ్లిని ఎలా సక్సెస్ చేసుకోవాలో ఇక్కడ చూద్దాం.

 

జీవితాంతం ఒకరితో ఒకరు కలిసి నడవడమే పెళ్లి. ఇది ఒక అందమైన ప్రయాణం. కానీ కొన్నిసార్లు ఈ జర్నీలో పొరపాట్ల వల్ల ఒకరిమీద ఒకరికి ప్రేమ తగ్గిపోవచ్చు. దూరాలు రావచ్చు. అయితే వివాహ బంధాన్ని సంతోషంగా ఉంచడానికి ప్రేమతో పాటు ఇంకా ఏమేం కావాలో తప్పకుండా తెలుసుకోవాలి. పెళ్లిలో మనం చేసే 8 సాధారణ తప్పుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

1. ప్రేమతో పాటు స్నేహం

చాలామంది పెళ్లయ్యాక భార్యాభర్తల సంబంధాన్ని మాత్రమే కొనసాగిస్తారు. భాగస్వామితో స్నేహితుల్లా ఉండరు. వివాహబంధం సరదాగా ఉండాలంటే ప్రేమతో పాటు స్నేహం కూడా అవసరం. నవ్వుతూ, జోకులు వేస్తూ, రహస్యాలు పంచుకుంటూ స్నేహం ఉండేలా చూసుకోండి. రొమాన్స్ తగ్గినప్పుడు స్నేహం బంధాన్ని బలంగా ఉంచుతుంది.

2. ఆధిపత్యం వద్దు

పెళ్లంటే ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించడం కాదు. ఎక్కువ పొసెసివ్‍నెస్ ఉంటే బంధంలో ఊపిరాడనట్లు ఉంటుంది. పెళ్లిలో నమ్మకం చాలా ముఖ్యం. మీ భాగస్వామి ఎదగడానికి అవకాశం ఇవ్వండి, నమ్మండి.

3. మాట్లాడటం ఆపొద్దు

పెళ్లైన మొదట్లో భార్యాభర్తలు బాగా మాట్లాడుకుంటారు. కానీ నెమ్మదిగా మాటలు తగ్గిపోతాయి. దీనివల్ల బంధంలో దూరాలు వస్తాయి. మనసులో బాధను దాచుకోవడం లేదా కష్టమైన విషయాలను దాటవేయడం వల్ల సమస్యలు పెరుగుతాయి. మీ సంతోషాలను, బాధలను పంచుకోండి. మీ భాగస్వామి చెప్పేది శ్రద్ధగా వినండి. ఇది బంధాన్ని బలంగా ఉంచుతుంది. ఎమోషనల్‍గా దగ్గర చేస్తుంది.

4. థాంక్యూ, సారీ

చాలాసార్లు భాగస్వామి మన కోసం చేసే చిన్న చిన్న ప్రయత్నాలు, పనులను కూడా పట్టించుకోము. థాంక్యూ చెప్పము, తప్పు చేస్తే సారీ చెప్పము. ఈ రెండు మాటలు ప్రేమగా చెబితే బంధం ఎప్పుడూ చెడిపోదు. కృతజ్ఞత చూపడం వల్ల బంధంలో గౌరవం, ప్రేమ ఉంటాయి.

5. ఒకరి కోసం ఒకరు టైమ్ తీసుకోండి

బిజీ లైఫ్‍స్టైల్ వల్ల చాలామంది ఒకరికొకరు టైమ్ ఇవ్వలేరు. కానీ పెళ్లి జీవితం సంతోషంగా ఉండాలంటే కలిసి క్వాలిటీ టైమ్ గడపడం ముఖ్యం. అది మూవీ నైట్ అయినా, డిన్నర్ డేట్ అయినా, ట్రిప్ అయినా సరే. కలిసి టైమ్ స్పెండ్ చేయండి.

6. మిమ్మల్ని మీరు చూసుకోవాలి

భాగస్వామిని చూసుకోవడం మంచిదే. కానీ మిమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేసుకోవద్దు. పెళ్లయ్యాక చాలామంది తమను తాము చూసుకోవడం మానేస్తారు. మిమ్మల్ని మీరు అందంగా ఉంచుకుంటేనే భాగస్వామికి అట్రాక్షన్ ఉంటుంది. మీరు అందంగా ఉంటే సంతోషంగా ఉంటారు. బంధంలో పాజిటివిటీ ఉంటుంది.

7. గొడవలను సరిగ్గా పరిష్కరించుకోండి

గొడవలకు దూరంగా ఉండటం కంటే వాటిని సరిగ్గా పరిష్కరించుకోవడం ముఖ్యం. ఏదైనా తేడా వస్తే ప్రశాంతంగా మాట్లాడండి. మీ అభిప్రాయాలను వినయంగా చెప్పండి. కలిసి పరిష్కారం కనుక్కోండి. ఆరోగ్యకరమైన చర్చ, అవగాహనతో పరిష్కరించుకున్న గొడవ బంధాన్ని మరింత బలంగా చేస్తుంది.

8. వ్యక్తిగత విషయాల్లో గౌరవం ఇవ్వండి

పెళ్లంటే అన్నీ పంచుకోవాలని కాదు. ప్రతి ఒక్కరికీ కొన్ని వ్యక్తిగత విషయాలు ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవడం, గౌరవించడం ముఖ్యం. మీ భాగస్వామికి ఇష్టమైనవి చేయడానికి అనుమతించండి. స్వేచ్ఛ ఇవ్వండి. దీనివల్ల మీ బంధం బ్యాలెన్స్డ్ గా, స్ట్రాంగ్‍గా ఉంటుంది.