ఆడవాళ్లు ఉదయం లేచిన దగ్గరినుంచి రాత్రి పడుకునే వరకు ఇంట్లో ఏదో ఒక పనిచేస్తూనే ఉంటారు. వారి టైం అంతా వాటికే గడిచిపోతుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు మీ టైం సేవ్ చేసుకోవచ్చు.
సాధారణంగా ఆడవాళ్లు రోజంతా పనిచేసినా.. ఇంకా ఏదో ఒక పని మిగిలి ఉంటూనే ఉంటుంది. టైం అంతా ఇంటిపనిలోనే గడిచిపోతుంది. ఎంత త్వరగా పని కంప్లీట్ చేద్దామన్నా అవ్వట్లేదు అని చాలా మంది ఆడవాళ్ల కంప్లెంట్. కొన్నిసార్లు చేసిన పనినే మళ్లీ చేయాల్సి వస్తుంటుంది. ఎక్కువసేపు వాటికే టైం కేటాయించాల్సి వస్తుంది.
నిజమే మూస ధోరణిలో పనిచేస్తే అలాగే ఉంటుంది. కాలంతో పాటు మనమూ అప్ డేట్ కావాలి. ఏ ఆహారం ఎలా తయారుచేస్తే సింపుల్, ఎలా స్టోర్ చేయడం సింపుల్ లాంటి విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. సరిగ్గా అలాంటివే ఈ చిట్కాలు. ఈ సింపుల్ ట్రిక్స్ ఒకసారి ట్రై చేయండి. మీ పని తేలికగా అవుతుంది. టైం కూడా చాలా సేవ్ అవుతుంది.
ఇంటి పనులు చక చక చేయాలంటే
ఆపిల్స్
ఆపిల్స్ దాదాపు అందరి ఇంట్లో ఉంటాయి. వీటిని పిల్లల నుంచి పెద్దల వరకూ టిఫిన్ బాక్స్‌లో పెట్టుకుంటారు. కానీ, ఆపిల్ ముక్కలుగా కోసి ఉంచితే పాడైపోతుంది. ఆపిల్ ఎక్కువసేపు ఫ్రెష్‌గా ఉండాలంటే, ఒక గిన్నె నీళ్లలో ఉప్పు, నిమ్మరసం కలపండి. ఆపిల్ ముక్కలు ఒకటి, రెండు నిమిషాలు నానబెట్టండి. తుడిచి టిఫిన్ బాక్సులో పెట్టండి. ఇలా చేస్తే ఆపిల్ ఎక్కువసేపు ఫ్రెష్‌గా ఉంటుంది.
క్యాబేజీ కూర
చలికాలంలో క్యాబేజీ కూర ప్రతి ఇంట్లో చేస్తారు. కానీ, క్యాబేజీని ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో ఉంచితే పురుగులు పడతాయి. పాడైపోతుంది. క్యాబేజీ పాడవకుండా ఉండాలంటే, పక్కలు కట్ చేసి, కాడతో సహా గ్యాస్ మీద ఒక నిమిషం వేడి చేయండి. పురుగులు పోతాయి.
ఆయిల్ వాసన
ఆవనూనెతో పాటు చాలా ఇళ్లలో సోయాబీన్, ఆలివ్ ఆయిల్ వాడతుంటారు. వాటి వాసన వేరుగా ఉంటుంది. ఆయిల్ వాసన తొలగించాలంటే, ఉల్లిపాయ, వెల్లుల్లి వేయండి. వాసన పోతుంది. వెల్లుల్లి ఇష్టం లేకపోతే, జీలకర్ర, మిరియాలు వేయండి.
చపాతీలు చేసేటప్పుడు
రొట్టెలు, చపాతీలు చేస్తుంటే, ఇనుప తవ్వ మురికి అవుతుంది. దాన్ని రుద్దడం చాలా కష్టం. ఈ కష్టం తప్పించుకోవడానికి, తవ్వను గ్యాస్ మీద పెట్టి, మీడియం మంట మీద కొంచెం నీళ్లు పోసి, వంట సోడా, ఉప్పు వేసి నాలుగువైపులా పరచండి. డిటర్జెంట్ కూడా వాడవచ్చు. మట్టి ప్రమిదతో రుద్దండి. నీళ్లు ఎక్కువ వేడిగా ఉంటే, గ్యాస్ ఆపేయండి. ప్రమిద లేకపోతే, నిమ్మకాయ లేదా బంగాళాదుంప ముక్క వాడండి.
