హైదరాబాదీ మిర్చి కా సలాన్ రెసిపీ.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది..
మిర్చికా సలాన్ ను బిర్యానీతో తింటే బలే ఉంటుంది. అందులోనూ ఈ రెసిపీ ప్రతి రెస్టారెంట్లలో కనిపిస్తుంది. మరి ఈ రెసిపీని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం పదండి..
హైదరాబాద్ మిర్చి కా సలాన్ రెసిపీ హైదరాబాద్‌లోని ఈ సాంప్రదాయిక వంటకం. ఇవి వివిధ రుచులు, మసాలాలతో గుమగుమలాడుతుంది. దీన్ని రోటీ, అన్నంతో తినొచ్చు. ప్రత్యేకంగా దీన్ని బిర్యానీతో తింటే టేస్ట్ బలే ఉంటుంది. ఈ మసాలా కూరకు కొబ్బరి, సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తారు. మరి ఈ రెసిపీని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
కావలసిన పదార్థాలు
4 నుంచి 6 Bhavnagari మిరపకాయలు, 4 టేబుల్ స్పూన్ల వేరుశెనగలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 ఎండు మిర్చి, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి, 2 స్పూన్ వెల్లుల్లి, 1 స్పూన్ అల్లం, 2 టేబుల్ స్పూన్ల నూనె, 4 నుంచి 6 కరివేపాకు రెబ్బలు, 1 కప్పు ఉల్లిపాయ , 1 టీస్పూన్ గరం మసాలా, 1 టీస్పూన్ కారం పొడి, 1 టీస్పూన్ పసుపు , 2 టేబుల్ స్పూన్ల చింతపండు గుజ్జు, రుచికి తగ్గ ఉప్పును పక్కన పెట్టుకోవాలి.
తయారీ విధానం..
ముందుగా మిరపకాయలను నీట్ గా కడిగి.. వాటిని మధ్యలో పొడవుగా కోసి గింజలను తీసేయాలి. వీటిని పక్కన పెట్టుకుని ఒక నాన్ స్టిక్ పాన్ స్టవ్ పై పెట్టి అందులో నూనె వేసి మిరపకాయలను బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. మరో నాన్‌స్టిక్ పాన్ తీసుకుని అందులో వేరుశెనగలను, జీలకర్ర, ఎండుమిర్చి, కొత్తిమీర, కొబ్బరిని వేసి 2 నిమిషాల పాటు పొడిగా వేయించుకోవాలి. ఆ తర్వాత వేయించిపెట్టుకున్న దినుసులన్నింటినీ తీసుకుని వాటిలో అల్లం, వెల్లుల్లి వేసి కొన్ని నీళ్లను పోసుకుని పేస్ట్ లా తయారుచేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ పై పాన్ పెట్టి నూనె, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. వాటిని బాగా వేయించిన తర్వాత.. వెయించిన ఉల్లిపాయ పేస్ట్ ను వేసి మూడు నిమిషాల పాటు ఉండనివ్వండి. ఆ తర్వాత తయారుచేసిపెట్టుకున్న మసాలా పేస్ట్ ను వేసి 4 నుంచి 5 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడకనివ్వండి. ఆ తర్వాత దీనిలో చింతపండు గుజ్జు, నీళ్లను పోసి రుచికి తగ్గట్టు ఉప్పును కలపండి. దీనిపై మూతపెట్టి 2 నిమిషాలు బాగా ఉడికించండి. ఆ తర్వాత దీనిలో వేయించిన మిరపకాయలను వేసి బాగా కలపండి. 3 నుంచి 4 నిమిషాల పాటు ఈ రెసిపీని ఉడికించండి. అంతే గరం గరం హైదరాబాదీ మిర్చి కా సలాన్ రిసిపీ రెడీ అయినట్టే.. దీన్ని వేడి వేడి అన్నం లేదా బిర్యానీ లేదా రోటీతో తినండి.