Egg Freezing: ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? ఎవరు చేసుకోవచ్చు? ఏ వయసులో చేసుకోవచ్చు?
ఎగ్ ఫ్రీజింగ్.. ఈ మధ్య తరచూ వినబడుతున్న మాట. సినీస్టార్స్ నుంచి నార్మల్ పీపుల్ వరకు చాలామంది ఈ ప్రాసెస్ ఫాలో అవుతున్నారు. ఇంతకీ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటీ? ఎప్పుడు చేసుకోవాలి? ఏ వయసులో చేసుకోవాలి? ఏ సంవత్సరంలో ఈ ఎగ్ ఫ్రీజ్ చేయడం స్టార్ట్ చేశారు? ఇతర విషయాలు మీకోసం...

మారుతున్న కాలంతో పాటు మనుషుల్లో వారి ఆలోచనల్లో మార్పు రావడం సహజం. మనుషుల ఆలోచనలకు తగ్గట్టుగానే టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందుతోంది. ఎంతగా అంటే మనుషుల చావు, పుట్టుకలను కూడా శాసించే అంతా. మనిషి పుట్టుకకు సైతం సైన్సును జోడించడం ద్వారా మనం ఎప్పుడు పిల్లల్ని కనాలి అనుకుంటే అప్పుడే కనే విధంగా ఎగ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.
సాధారణంగా చాలామంది అమ్మాయిలు 18 నుంచి 25 వయసులోపు పెళ్లి, పిల్లలు లాంటి కార్యక్రమాలను పూర్తి చేసుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితులు వేరు. చదువు, ఉద్యోగం అని 30 వయసు వచ్చేవరకు కూడా పెళ్లిళ్లు కాని పరిస్థితి. సాధారణంగా 35 వయసు దాటిపోతే పుట్టే పిల్లలకు ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొందరైతే 30 లోపు పిల్లల్ని కనడమే మంచిది అంటున్నారు.
సాధారణంగా వయసు పెరిగేకొద్దీ ఆడవారి అండం నాణ్యత తగ్గుతుంది. అందువల్ల ఎక్కువమంది మహిళలు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఇటీవల కొంతమంది సినిమా స్టార్స్, వారి కుటుంబ సభ్యులు కూడా ఎగ్ ఫ్రీజ్ చేసుకున్న ఘటనలు మనం చూశాం. కానీ ఎంత వయసు వారు ఎగ్ ఫ్రీజ్ చేసుకోవచ్చు? ఎంతకాలం ఎగ్ ఫ్రీజ్ చేయవచ్చు లాంటి ప్రశ్నలు అందరి మనసులోనూ ఉన్నాయి. ఎప్పుడు, ఎలా ఎగ్ ఫ్రీజ్ చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ ఫ్రీజ్ చేయించుకోవడానికి సరైన వయస్సు
ఎగ్ ఫ్రీజింగ్ ని అండాశయ క్రయోప్రిజర్వేషన్ అని కూడా అంటారు. ఈ ప్రక్రియలో మహిళల ఎగ్ ని సేకరించి, దానిని చాలా కాలం పాటు ఫ్రీజ్ చేస్తారు. కెరీర్ లేదా ఇతర కారణాల వల్ల కొంతకాలం తర్వాత పిల్లలు కావాలనుకునే మహిళలకు ఎగ్ ఫ్రీజింగ్ ని సజ్జెస్ట్ చేస్తారు. 37 సంవత్సరాల లోపు ఉన్నవారు ఎగ్ ఫ్రీజ్ చేయించుకోవచ్చట.
హార్మోన్ల ఇంజెక్షన్లు
ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకునే ముందు మహిళ శరీరాన్ని పరీక్షిస్తారు. ఆ తర్వాత అండాశయం నుంచి అండాలను ఉత్పత్తి చేయడానికి హార్మోన్ల ఇంజెక్షన్లు ఇస్తారు. అప్పుడు ఎగ్ ని ఫ్రీజ్ చేసి భవిష్యత్తులో ఉపయోగించవచ్చు. 1986 లో మొదటిసారిగా ఫ్రీజ్ చేసిన ఎగ్ ద్వారా పిల్లలు పుట్టారు.
ఎంతకాలం ఫ్రీజ్ చేసిన ఎగ్ భద్రంగా ఉంటుంది?
సాధారణంగా 10 సంవత్సరాల వరకు ఎగ్ ఫ్రీజ్ చేయించుకోవచ్చు. అవసరమైతే ఈ కాలాన్ని 20 సంవత్సరాలకు పైగా పొడిగించవచ్చు. కొన్ని బీమా కంపెనీలు ఎగ్ ఫ్రీజింగ్ ఖర్చును భరిస్తాయి.
ఎవరు ఎగ్ ఫ్రీజ్ చేయించుకోవచ్చు?
- కీమోథెరపీ లేదా పెల్విక్ రేడియేషన్ లాంటి క్యాన్సర్ చికిత్స తీసుకునే వారు.
- త్వరగా రుతుక్రమం ఆగిపోయే చరిత్ర ఉన్నవారు.
- సామాజిక, వ్యక్తిగత కారణాల వల్ల కూడా ఎగ్ ఫ్రీజ్ చేయించుకోవచ్చు.

