మొటిమల వల్లే నల్లని మచ్చలు ఏర్పడతాయి. అయితే కొందరికి ఈ మొటిమలు పూర్తిగా తగ్గిపోయినా.. వాటి మచ్చలు మాత్రం అస్సలు పోవు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ మొండి మచ్చలను ఇట్టే తగ్గించుకోవచ్చు.
ముఖం అందంగా, ఆకర్షణీయంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. ఇందుకోసం ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయితే ముఖంపై ఉండే నల్లని మచ్చలను మాత్రం పోగొట్టుకోలేకపోతుంటారు. మచ్చలు కావడానికి ఎన్నో కారణాలున్నా.. మొటిమల వల్ల కూడా ఇవి ఏర్పడతాయి. అయితే మొటిమలు తగ్గినా.. మచ్చలు మాత్రం అలాగే ఉంటాయి. మచ్చల వల్ల ముఖం అందం తగ్గుతుంది. మొటిమలను గిచ్చినా, అవి పగిలినా నల్ల మచ్చలు ఎక్కువవుతాయి. అయితే కొంతమందికి ఈ మచ్చలు వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ కొంతమందికి మాత్రం తగ్గవు. కానీ కొన్ని చిట్కాలను పాటిస్తే ఈ నల్లని మచ్చలను సులువుగా తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతి ఒక్క ఇంట్లో కీరదోసకాయ ఖచ్చితంగా ఉంటుంది. ఇంట్లో లేకున్నా మార్కెట్ లో ఇవి దొరుకుతాయి. అయితే కీరాను జ్యూస్ గా చేసి ముఖానికి, మెడకు అప్లై చేయండి. అరగంట తర్వాత కడిగేయండి. ఇది మీ ముఖ కాంతిని పెంచుతుంది. కీరదోసకాయ రసంలో కొద్దిగా పెరుగును కలిపి ముఖానికి అప్లై చేస్తే నల్లటి మచ్చలు తొందరగా తగ్గిపోతాయి.
కలబంద
కలబంద రసాన్ని తీసుకుని రెండు టీస్పూన్ల కీరదోసకాయ రసాన్ని కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా అప్లై చేయండి. అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోండి.
శెనగపిండి
శెనగపిండిలో పెరుగును, పసుపును వేసి పేస్ట్ లా తయారుచేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. దీనివల్ల డార్క్ స్పాట్స్ తొందరగా తొలగిపోతాయి. ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి మూడు సార్లు అప్లై చేయండి.
కాఫీ పొడి
ఒక టీస్పూన్ కాఫీ పొడిని తీసుకుని అందులో చిటికెడు పసుపు, ఒక టీస్పూన్ పెరుగు వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖమంతటా అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని నీట్ గా కడిగేయండి.
నారింజ తొక్క పొడి
ఒక టేబుల్ స్పూన్ నారింజ తొక్కల పొడిని తీసుకుని అందులో రెండు టీస్పూన్ల పసుపును కలపండి. తర్వాత దీనిలో రోజ్ వాటర్ వేసి పేస్ట్ లా చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖమంతటా అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత కడిగేయండి.
