ఎండాకాలం వచ్చిందంటే చాలు అందరి చూపు.. ఏసీలపైనే ఉంటుంది. కనీసం పది పదిహేను నిమిషాలు కూడా ఏసీ లేకుండా ఉండలేని పరిస్థితి. ఫ్యాన్ గాలి ఉన్నా.. వేసవిదెబ్బకి అది కూడా వేడిగా ఉండటంతో.. అందరి మనసు ఏసీ వైపే లాగుతుంటుంది. అవును తప్పదు.. ఏసీ చల్లదనం లేకుంటే.. వేడి, చెమటలు, మంటలు, చిరాకు అన్నీ వచ్చేస్తాయి. అదే ఏసీ చల్లగా ఉంటే.. హాయిగా పనిచేసుకోవచ్చు.  ఇక్కడి వరకు బాగానే ఉంది.. మరి ఆరోగ్యం సంగతేంటి..?

ఏసీ వల్ల ఆరోగ్యానికి ముప్పు ఉందా..? ఉందనే సమాధానం ఎక్కువగా వినపడుతోంది. మనకు వేసవిలో హాయిగా నిలుస్తున్న ఏసీ.. కళ్లకు మాత్రం శాపంగా నిలుస్తోంది. ఏసీలో ఎక్కువ గంటలు గడిపేవారు.. ‘డ్రై ఐ సిండ్రోమ్’ బారిన పడుతున్నట్లు ఓ సర్వేలో తేలింది. వారంతా వేసవిలోనే ఈ జబ్బుకి గురవ్వడం గమనార్హం.

ఉదయం పూట ఇంట్లో ఏసీ.. ఆఫీసుకువెళ్లే వాహనంలో ఏసీ.. ఆఫీసులో ఏసీ.. మళ్లీ ఇంటికి తిరిగి వచ్చాక ఏసీ.. ఇలా కొందరు రోజుకి 16నుంచి 18గంటలపాటు ఏసీలో గడుపుతున్నట్లు ఓ సర్వేలో తేలింది. వారికే ఈ డ్రై ఐ సిండ్రోమ్ వ్యాధి కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. కన్ను తన విధిని తాను సక్రమంగా, సరైన విధంగా నిర్వర్తించేందుకు నిర్ణీత పరిమాణంలో కళ్లలో నీటి బిందువులు ఉండాల్సిన అవసరం ఉంది. 

ఈ నీటి బిందువులు బాహ్యంగా ఆయిలీ లేయర్, మధ్యలో వాటర్‌ లేయర్, లోపల ప్రొటీన్‌ లేయర్‌తో సంరక్షించబడుతుంటాయి. ఎయిర్‌ కండిషన్డ్‌ రూమ్‌లో అత్యంత తక్కువ టెంపరేచర్‌ ఉండే పరిస్థితుల్లో పరిసరాల్లో తేమ శాతం బాగా తగ్గిపోతుంది. తద్వారా నీటి బిందువులకు రక్షణ కవచాలుగా ఉండాల్సిన పొరలు బలహీనపడిపోతాయి. శరీరానికి తగిలే గాలి పూర్తిగా పొడి బారినది అవడం వల్ల అది కంటి పనితీరుపై తీవ్ర ప్రభావం చూపించి డ్రై ఐ సిండ్రోమ్ గా మారుతోంది.

కళ్లు పొడిబారడం, కళ్లలో మంట, దురద, కంటి నుంచి నీరు కారడం, ఎర్రబడడం, చూపు మసకబారడం వంటి లక్షణాలతో ఈ డ్రై ఐ సిండ్రోమ్‌ వస్తుంది. ఇలా ఎక్కువ సేపు ఇదే రకమైన ఎయిర్‌ కండిషన్డ్‌ వాతావరణంలో ఉండడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది. మరోవైపు ఏసీ మిషిన్ల నిర్వహణ సరిగా లేకపోతే వ్యాప్తి చెందే వైరస్, బాక్టీరియా, ఫంగస్‌ కూడా కంటి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది.

ఈ సమస్యకు పరిష్కారం లభించాలంటే..  మరీ తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఏసీలు ఉంచరాదు. మినిమమ్.. 23 నుంచి 25 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. అవసరమైతే... ఫ్యాన్ కూడా వేసుకోవచ్చు. దీనివల్ల సమస్య తీవ్రతరం కాస్త తగ్గుతుంది.