లావుగా ఉన్నవారంతా అతిగా ఆహారం తినడం వల్లే అలా లావుగా అయ్యారు అనుకోవడం పొరపాటు. కొందరు హార్మోన్ల లోపం వల్ల కూడా బరువు పెరగి ఉండొచ్చు. ఏది ఏమైనా ఈ మద్యకాలంలో అతిగా బరువు పెరగడం.. పొట్ట పెరగడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే... శరీరంలో విటమిన్ సి లోపించడం వల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

శరీరానికి తగినంత విటమిన్ సి ని అందిస్తే.. సులభంగా బరువు తగ్గే అవకాశం ఉందని ఓ పరిశోధనలో వెల్లడయ్యింది. చాలా పండ్లు, కూరగాయల్లో ఉండే విటమిన్ సిలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. రోజూ తగిన పండ్లు, కూరగాయలు తింటే... సరిపడా విటమిన్ సి పొందగలం. అస్కార్బిక్ యాసిడ్‌గా పిలిచే విటమిన్ సి... మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.

 రకరకాల వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. మీరు అధిక బరువును తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉంటే, మీకు ఎంతకీ పొట్ట తగ్గట్లేదని అనిపిస్తే... వెంటనే మీరు విటమిన్ సి ఉండే పండ్లు, కూరగాయల్ని ఎక్కువగా తీసుకోవాలి. కేవలం బరువు తగ్గించడం మాత్రమే కాదు... విటమిన్ సి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

 ఇది గుండెకు మేలు చేస్తుంది. కాన్సర్ వచ్చే అవకాశాల్ని తగ్గిస్తుంది. చర్మం ఆరోగ్యవంతంగా ఉండాలన్నా, ఎముకలు బలంగా ఉండాలన్నా విటమిన్ సి అవసరం. శరీర బరువును క్రమబద్ధీకరించడంలో విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తోంది. మన శరీరంలోని కొవ్వు కణాలు శక్తిని ఉత్పత్తి చేసేలా విటమిన్ సి చేస్తుంది. అందువల్ల కొవ్వు కణాలు పెరగకుండా ఉంటాయి. అదే విటమిన్ సీ తక్కువగా ఉంటే... ఆటోమేటిక్‌గా నడుం చుట్టూ... రింగులా కొవ్వు పేరుకుపోయి... పొట్ట వచ్చేస్తుంది.

విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలు : ఉసిరి, నారింజ, నిమ్మకాయ, కివి, ద్రాక్ష, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, టమాటా, జామకాయ, మామిడికాయ, స్ట్రాబెర్రీ, బ్రకోలీ, మొలకలు, కాలీఫ్లవర్, బంగాళాదుంపలు.

మగవాళ్లు రోజూ 90 మిల్లీగ్రాముల విటమిన్ సి తీసుకోవాల్సి ఉంటుంది. ఆడవారు రోజూ 75 మిల్లీగ్రాములు పొందాల్సి ఉంటుంది. ఐతే... పెద్దవాళ్లు రోజుకు 2వేల మిల్లీగ్రాములకు మించి విటమిన్ సి తీసుకోకూడదు. అలా చేస్తే కడుపునొప్పితోపాటూ... ఇతర అనారోగ్యాలు తప్పవు.