ఆచార్య చాణక్యుడి నీతి సూత్రాలు జీవితానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పటికీ చాలామంది ఆయన నీతి సూత్రాలను అనుసరిస్తూ ఉంటారు. చాణక్య నీతి ప్రకారం కొన్ని ప్రదేశాలకు అస్సలు వెళ్లకూడదట. వెళ్తే ఏమవుతుంది అనుకుంటున్నారా? తెలుసుకోండి మరి.
ఆచార్య చాణక్యుడు తన అనుభవాలతో కుటుంబం, సమాజం, దేశం, సైన్యం, సహా అనేక విషయాల గురించి అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించాడు. ఈ అనుభవాల ఆధారంగా రూపొందించిన పుస్తకం చాణక్య నీతిగా ప్రసిద్ధి చెందింది. ఇందులో మంచి జీవితానికి ఉపయోగపడే అనేక సూత్రాలు ఉన్నాయి. చాణక్యుడి నీతి ప్రకారం, అస్సలు వెళ్లకూడని కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఒకవేళ అక్కడికి వెళ్తే మానసికంగా, శారీరకంగా లేదా ఆర్థికంగా నష్టపోతారట. ఇంతకీ ఎక్కడికి వెళ్లకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
సంస్కారం లేని చోటు
ఆచార్య చాణక్యుడి ప్రకారం మంచి విలువలు లేని, పుట్టుకతో మంచి సంస్కారం లేని, ఒకరినొకరు మోసం చేసుకునే, అబద్ధాలు చెప్పే, కుట్రలు చేసే వాళ్లు ఉండే చోటికి ఎప్పుడూ వెళ్లకూడదు. అక్కడ ఇల్లు కట్టుకునే ఆలోచన అస్సలు చేయకూడదు. ఒకవేళ అక్కడ నివసిస్తే మీరు కూడా వాళ్లలాగే తయారవుతారు లేదా నాశనమవుతారని చాణక్య నీతిలో పేర్కొనబడింది.
పని లేని చోటు
చాణక్యుడి ప్రకారం, ఉద్యోగ అవకాశాలు లేని చోటు లేదా మీకు ఎలాంటి పనులు లేని చోటికి వెళ్లడం వృథా. ఆ ప్రదేశం ఎంత అందంగా ఉన్నా మీకు అక్కడ ఎలాంటి ఉద్యోగం లేదా వ్యాపార అవకాశాలు లేకపోతే అక్కడ ఉండడం అనవసరం. అలాంటి ప్రదేశాలను వీలైనంత త్వరగా వదిలి వెళ్లాలి.
చదువుకునే వాతావరణం లేని చోటు
ఏ వ్యక్తి అభివృద్ధిలోనైనా చదువు చాలా ముఖ్యం. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, అధ్యయనానికి, పఠనానికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వని చోటుకి వెళ్తే మీరు ముందుకు వెళ్లే బదులు వెనక్కి తగ్గుతున్నట్లే. అక్కడ మీరు నేర్చుకున్నదంతా పోయి ఏమీ మిగలదు. కాబట్టి అలాంటి చోటుకి వెళ్లకూడదు.
సహాయం చేసేవాళ్లు లేని ఊరు
జీవనోపాధి కోసం కొత్త ప్రదేశాలకు వెళ్లడం కొత్తేమీ కాదు. కానీ అక్కడికి వెళ్లే ముందు మీకు సహాయం చేయడానికి ఎవరైనా ఉన్నారా అని చూసుకోండి. లేకపోతే మీకు కష్టం వస్తే ఒంటరిగా మిగిలిపోతారు. కాబట్టి మీ స్నేహితులు లేదా బంధువులు లేని చోట ఎక్కువ కాలం ఉండకూడదు.
గౌరవం లేని చోటు
ప్రతి ఒక్కరూ తమను గౌరవించాలని కోరుకుంటారు. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అలాంటి పరిస్థితుల్లో మీ మాటలను పట్టించుకోని చోటుకి వెళ్తే ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని అవమానిస్తే లేదా తిడితే మీరు అలాంటి చోటుకు దూరంగా ఉండాలి. ఇది మిమ్మల్ని బతికుండగానే చంపినట్లవుతుంది. పండితులకు అవమానమే మరణంతో సమానం అంటారు పెద్దలు.
అప్పు అడిగేవాళ్ల చోటు
ఎప్పుడూ అప్పు అడిగేవాళ్లు, మీ దగ్గర ఏదో ఒకటి ఆశిస్తూ ఉండేవాళ్లు, మీరు ఎంత ఇచ్చినా ఇంకా కావాలనే వాళ్లు, పేదరికంలో ఉండి కూడా దాని నుంచి బయటపడటానికి ఏ ప్రయత్నం చేయని వాళ్లు ఉండే చోటుకి మీరు వెళ్లకూడదు. దీనివల్ల మీకు నష్టమే తప్ప లాభం ఉండదు. ఒకవేళ ఆ ప్రదేశాలకు వెళ్తే మానసికంగా, శారీరకంగా లేదా ఆర్థికంగా నష్టపోతారని చాణక్య నీతిలో బోధించబడింది.
