Asianet News TeluguAsianet News Telugu

కోటిపూల పాట.. బతుకమ్మ పాట పుట్టుక, ప్రాచుర్యం విశేషాలు...

బతుకమ్మ పండుగ అంటే ఓ పాటల పరవశం.. తొమ్మిది రోజులపాటు ఆటపాటల నివేదన.. ప్రకృతికి మనిషి  చేసే వందనం.. భగవంతుడిని పూజించే పూలే పూజలందుకునే వేడుక.. బతుకును కోరే పండుగ బతకమ్మ.. చల్లని బతుకునిచ్చే తల్లి గౌరమ్మగా.. ఆ గౌరమ్మే బతుకమ్మగా  కొలుస్తారు.  

bathukamma songs historical importance and folk song tradition of telangana
Author
First Published Sep 21, 2022, 1:26 PM IST

శ్రీ లక్ష్మీ స్వరూపంగా  బతుకమ్మను పూజిస్తారు. బతుకమ్మ పూజకు పూజారులు ఉండరు. పాటలు వచ్చిన ప్రతి ఒక్కరు పూజారులే.  దీనికి కులం, మతం, పేదా, గొప్పా తేడా లేదు. బతుకమ్మ పాటలో జీవితం పల్లవిస్తుంది. పురాణేతిహాసాలు అలవోకగా వినిపిస్తాయి. నిజ జీవిత సత్యాలు కనిపిస్తాయి. అమ్మాయిలకు తల్లులు చెప్పే సుద్దులు వినిపిస్తాయి. అత్తగారి ఆరళ్లు కనిపిస్తాయి. సమాజంలోని  వేదన,  పీడనలు ఉంటాయి. మొత్తంగా చెప్పాలంటే బతుకమ్మ పాటలు మన పూర్వీకులు ముందు తరాలకు అందించిన విజ్ఞాన భాండాగారాలు. 

బతుకమ్మ పాటలు ఉయ్యాలో, వలలో, కోల్, చందమామ అనే చరణాలతో  సాగుతాయి. ఈ పాటల్ని ఉయ్యాల పాటలు అని కూడా అంటారు. ఈ పాటల్లో రామాయణ, భారత, భాగవత కథ లాంటి పౌరాణిక గేయాలు..  పల్నాటి వీరులు, కాటమరాజుల వంటి వీరగాథలు.. చారిత్రక కథలు, శైవ, వైష్ణవ సంబంధిత కథలను తెలిపే మత సంబంధిత గేయాలు..  భక్తి, వేదాంతం, కర్మ, వైరాగ్యం, జ్ఞానం, నమ్మకాలను తెలిపే పారమార్థిక గేయాలు.. లాలి పాటలు, పెళ్లి  పేరంటాలు, వేడుకలు, ఆచారాలు తెలిపే స్త్రీల పాటలు.. శృంగార, అద్భుత, కరుణ రస పూరిత పాటలు..  పిల్లల పాటలు, గ్రామం కోసం, ప్రజల కోసం బలైన వారి కథలు, ఉద్యమ గీతాలు.. వాస్తవ పరిస్థితులను చిత్రీకరించే వాస్తవ సంఘటనలు.. ఇవే బతుకమ్మ పాటలుగా రూపొందాయి.  

25 నుంచి బతుకమ్మ ఉత్సవాలు.. విస్తృత ఏర్పాట్లకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశం..

బతుకమ్మ ఆటలో పాటకు ఎంతో విశిష్టంగా ఉంది. సంగీత జ్ఞానం ఏమాత్రం లేని జానపద స్త్రీలు పాటలు లయబద్ధంగా.. సంగీతంబద్ధంగా పాడతారు. అదే ఆశ్చర్యంగా ఉంటుంది. దశాబ్దాలుగా ఈ పాటలు జానపదుల నోళ్లలో నానుతూ.. తరాలకు అలా మౌఖికంగా అందుతూ.. కొనసాగుతున్నాయి. బతుకమ్మ పాటలోని మాధుర్యం తెలియాలంటే.. పాటలోని వస్తువు, లయ, ఆవృతాలను గమనించాలి. బతుకమ్మ పాటలోని వస్తువు జీవితమే. జీవితంలోని పలు కోణాలు పాటలుగా మారుతున్నాయి. 

మహాత్మాగాంధీ గారు స్వాతంత్ర్య ఉద్యమం చేస్తున్న సమయంలో పుట్టిన పాట.. 
గుజరాతి దేశాన ఉయ్యాలో  
పుట్టెనమ్మ గాంధీ ఉయ్యాలో..
గాంధి పుట్టుక నేను ఉయ్యాలో..
చెప్పుతాయోనమ్మ ఉయ్యాలో...
అంటూ మహాత్మాగాంధీ చరిత్రను పాటలోకి అలవోకగా తీసుకువచ్చారు. 

మహాభారత, రామాయణ, శివుడు, ఎల్లమ్మ, రేణుక, వృత్తి సంబంధమైన కథలు, తాత్విక కథలు..అన్నీ బతుకమ్మ పాటలుగా మలుచుకున్నారు. కథలే కాదు సంఘటనలు కూడా పాటలుగా మలుచుకుని పాడుకున్నారు. 

వెనకొచ్చే ఆవులారా ఉయ్యాలో..
ఎర్రావులారా ఉయ్యాలో.. 
మీరందరొస్తిరి ఉయ్యాలో..
నాకొడుకు ఏడి ఉయ్యాలో..

నడిమధ్య ఆవులారా ఉయ్యాలో 
నల్లావులారా ఉయ్యాలో.. 
మీరందరొస్తిరి ఉయ్యాలో..
నాకొడుకు ఏడి ఉయ్యాలో..

ముందొచ్చే ఆవులారా ఉయ్యాలో..
ముంగావులారా ఉయ్యాలో.. 
మీరందరొస్తిరి ఉయ్యాలో..
నాకొడుకు ఏడి ఉయ్యాలో..

పట్నం పోయిన కొడుకు తిరిగా రాలేదని ఎదురు చూస్తున్న తల్లి ఆవేదన ఈ పాటలో కనిపిస్తుంది. 

బతుకమ్మ పాటల్లో అలా అలవోకగా స్త్రీ అనుభవాలనుంచి పుట్టినవే ఎక్కువ. ఈ పాటలకు జానపద గేయాలకుండే లక్షణాలే ఎక్కువగా కనిపిస్తాయి. ఈ పాటలు చాలావరకు ఎవరు రాశారో తెలియని అజ్ఞాత రచనలే ఎక్కువ. అందుకే ఎన్నో సంవత్సరాలుగా ఒక తరం నుంచి మరో తరానికి ఈ పాటల ప్రకారం మౌఖికంగానే జరిగింది. జరుగుతుంది. 

బతుకమ్మ పాటల్లో సరళత్వం కనిపిస్తుంది. సామూహిక గానం వినిపిస్తుంది. ఆటపాటల మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. పల్లవి, ఫలశృతి, దేవతాస్తుతి లాంటి ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. 

బతుకమ్మ పాటతో సుఖదు:ఖాలు, సంతోషవిషాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, సాయుధపోరాటాలు, దొరల అకృత్యాలు అన్నీ పల్లవిస్తాయి. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ముందుకే సాగే జీవన సౌరభం కనిపిస్తుంది.. అందుకే...ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే గౌరమ్మ.. అంటూ దేవతల్ని.. పూజిస్తూ తమ కష్టసుఖాలను మరిచిపోతారు.

Follow Us:
Download App:
  • android
  • ios