Asianet News TeluguAsianet News Telugu

Bathukamma 2023: 9 రోజుల బతుకమ్మ పండుగ.. ఎనిమిది నైవేద్యాలు.. ఏమేం చేస్తారంటే?

Bathukamma 2023:  తీరొక్క పువ్వులతో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగ తొమ్మిది రోజులైనా ఎనిమిది నైవేద్యాలే సమర్పిస్తారు. ఒక రోజు నైవేద్యం చేయరు. మరి ఆ నైవేద్యాలేంటో తెలుసా? 
 

Bathukamma 2023:  Different Naivedyams Offered During Bathukamma Festival rsl
Author
First Published Oct 10, 2023, 3:41 PM IST

Bathukamma 2023: భాద్రపద అమావాస్య రోజు నుంచి బతుకమ్మ పండుగ మొదలవుతుంది.  ఈ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడి ఉంటుంది. అందుకే దీన్ని తెలంగాణలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మహిళలు, యువతులు తమ కుటుంబం శ్రేయస్సు, ఆరోగ్యం కోసం గౌరీదేవిని పూజిస్తారు. ఈ పండుగను తొమ్మిది రోజుల పాటు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అంతేకాదు ప్రతిరోజూ అమ్మవారికి ప్రత్యేకమైన నైవేద్యాన్ని కూడా సమర్పిస్తారు. మరి ఈ తొమ్మిది రోజుల పాటు సాగే బతుకమ్మ పండుగకు చేసే ఎనిమిది రకాల నైవేద్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..

1) ఎంగిలి పూల బతుకమ్మ : తెలంగాణ ఎంగిలి పూల బతుకమ్మ రోజునే పెత్రామాస అని కూడా అంటారు. ఈ పండుగ మహాలయ అమావాస్య అంటే భాద్రపద అమావాస్య నాడు ప్రారంభమవుతుంది.

నైవేద్యం: ఎంగిలి పూల బతుకమ్మ నాడు బియ్యంపిండి లేదా తడి బియ్యం తో నువ్వులను సమర్పిస్తారు. 

2. అటుకుల బతుకమ్మ: ఆశ్వయుజ మాసంలో పాడ్యమి వచ్చే రెండో రోజును అటుకుల బతుకమ్మ అంటారు.

నైవేద్యం: సప్పిడి పప్పు, బెల్లం , అటుకులు 

3) ముద్దపప్పు బతుకమ్మ: ముద్దపప్పు బతుకమ్మ మూడో రోజు విదియ లేదా ఆశ్వయుజ మాసం రెండవ రోజున వస్తుంది.

నైవేద్యం: ముద్దపప్పు , పాలు, బెల్లం 

4) నానబియ్యం బతుకమ్మ : ఆశ్వయుజ మాసంలో నాల్గో రోజు లేదా మూడవ రోజు వస్తుంది.

నైవేద్యం: నానబెట్టిన బియ్యం , పాలు, బెల్లం 

5) అట్ల బతుకమ్మ : ఆశ్వయుజ మాసంలో ఐదవ రోజు లేదా నాల్గవ రోజు వస్తుంది.

నైవేద్యం: అట్లు  (గోధుమపిండితో చేసిన పాన్ కేక్స్) లేదా దోశ

6) అలిగిన బతుకమ్మ : ఆశ్వయుజ మాసంలో ఆరో రోజు పంచమి లేదా ఐదో రోజు వస్తుంది. ఈ రోజు నైవేద్యం ఉండదు.

7) వేపకాయల బతుకమ్మ : ఆశ్వయుజ మాసంలో ఏడో రోజు లేదా ఆరో రోజు వస్తుంది.

నైవేద్యం: వేపచెట్టు పండ్ల ఆకారంలో ఉండే సకినాల పిండితో తయారుచేసేవి.

8) వెన్నముద్దల బతుకమ్మ : ఆశ్వయుజ మాసంలో ఎనిమిదో రోజు లేదా ఏడవ రోజు వస్తుంది.

నైవేద్యం: నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం 

9) సద్దుల బతుకమ్మ : ఆశ్వయుజ మాసంలో తొమ్మిదవ రోజు లేదా ఎనిమిదో రోజు బతుకమ్మను దుర్గాష్టమితో జరుపుకుంటారు.

నైవేద్యం: ఐదు రకాల వంటకాలు చేస్తారు: పెరుగన్నం, చింతపండు పులిహోర , నిమ్మకాయ పులిహోర, కొబ్బరి అన్నం,  నువ్వల సద్ది.

Follow Us:
Download App:
  • android
  • ios