కెమికల్ హెయిర్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం వల్ల జుట్టు నిర్జీవంగా మారుతుంది. అయితే కొన్ని రకాల ఆహారాలు మీ జుట్టును తిరిగి ఆరోగ్యంగా, సిల్కీగా పెరిగేందుకు సహాయపడతాయి.
ఆరోగ్యకరమైన, మృదువైన, మెరిసే జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. కానీ జుట్టుకు సరైన సంరక్షణ లేకపోవడం వల్ల అవి రాలిపోవడం ప్రారంభమవుతాయి. జుట్టు రాలకూడదని చాలా మంది ఎన్నో రకాల హెయిర్ ట్రీట్ మెంట్స్ తీసుకుంటుంటారు. కానీ ఇవి మీ జుట్టును మరింత దెబ్బతీస్తాయి. జుట్టు పొడిబారి నిర్జీవంగా కూడా కనిపిస్తుంది. అయితే కొన్ని రకాల ఆహారాలను రోజూ తింటే మీ జుట్టు తిరిగి ఆరోగ్యంగా, అందంగా మారుతుంది. అంతేకాదు ఆరోగ్యంగా కూడా జుట్టు పెరుగుతుంది.
జుట్టు రాలడానికి కారణాలు
ఆహారపు అలవాట్లు
ఒత్తిడికి గురికావడం
వెంట్రుకలను కవర్ చేయకుండా బయటకు వెళ్లడం
స్టెరాయిడ్లు అధికంగా వాడటం
కాలుష్యం నుంచి జుట్టును కాపాడకపోవడం
అతిగా ధూమపానం చేయడం
అరటిపండు
అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టుకు పోషణను ఇస్తుంది. అంతేకాదు ఇది మీ జుట్టుకు తేమను అందించడానికి కూడా పనిచేస్తుంది. అరటిపండ్లను తినడంతో పాటుగా అరటిపండు హెయిర్ మాస్క్ ను కూడా వేసుకోవచ్చు. ఇది జుట్టుకు అప్లై చేస్తే జుట్టు పొడిబారడం ఆగుతుంది.
చిలగడదుంపలు
బీటా కెరోటిన్ కు మంచి వనరు అయిన చిలగడదుంప జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో సహాయపడుతుంది. వాస్తవానికి ఇది మన శరీరంలోకి వెళ్ళగానే విటమిన్ ఎగా మారుతుంది. ఇది ఇతర ఆహార పదార్థాల నుంచి పొందిన పోషణ కంటే చాలా ఎక్కువ. దీనితో నెత్తిమీద మూసుకుపోయిన రంధ్రాలు తెరుచుకుంటాయి. దీంతో మీ జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
గోజీ బెర్రీలు
గోజీ బెర్రీలలో అమైనో ఆమ్లాలు, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ లు పుష్కలంగా ఉంటాయి. ఈ సూపర్ ఫుడ్ ను తినడం వల్ల ఐరన్, కాపర్, ఫాస్ఫరస్ లు మన శరీరానికి లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ఈ బెర్రీలు జుట్టుకు పోషణను అందిస్తాయి. ఇది జుట్టు పరిమాణాన్ని పెంచుతుంది. జుట్టు అందంగా కనిపిస్తుంది.
చియా విత్తనాలు
ఊబకాయాన్ని తగ్గించడానికి చాలా మంది వీటిని ఎక్కువగా తింటుంటారు. ఈ చియా గింజల్లో క్యాల్షియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ లు పుష్కలంగా ఉంటాయి. ఈ విత్తనాలను మిల్క్ షేక్స్, స్మూతీల్లో ఉపయోగించొచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల జుట్టు మూలాలకు పోషణ అందుతుంది. చియా విత్తనాలలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల జుట్టు బలపడి జుట్టు రాలడం ఆగుతుంది.
అవోకాడో
అవొకాడోల్లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అవోకాడోలను సలాడ్ లేదా స్మూతీగా కూడా తీసుకోవచ్చు. విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉన్న అవోకాడో రంధ్రాలను రిపేర్ చేస్తుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
