ఆరోగ్యం సరిగాలేకపోతే ఎవరైనా ముందు చేసే పని డాక్టర్ ని సంప్రదించడం. అలా హాస్పిటల్ కి వెళ్లగానే... ఓ నర్స్ వచ్చి మనకు బీపీ చెకప్ చేస్తుంది. అదేంటో అప్పటి వరకు మనకు బీపీ లేదనే ఫీలింగ్ ఉంటుంది. కానీ హాస్పిటల్ లో చెక్ చేయగానే బీపీ ఉన్నట్లు  చూపిస్తుంది. దీంతో.. బీపీ ఎక్కువగా ఉంది మీరు మందులు వాడాల్సిందేనని వైద్యులు చెప్పేస్తారు. అయితే... ఆ బీపీ రిపోర్ట్స్ దాదాపు తప్పు అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో దాదాపు 36శాతం బీపీ టెస్టులు తప్పని ఓ సర్వేలో తేలింది.

అంటే.. డాక్టర్లు మనకు అబద్ధం చెబుతున్నారా.. మనకు బీపీ లేకపోయినా మందులు మింగిస్తున్నారా అని కంగారు పడకండి. మీ కళ్ల ముందు చేసిన బీపీ టెస్ట్ కరెక్టే కానీ.. అది డాక్టర్ ని చూసే టెన్షన్ లో వచ్చేది మాత్రమే. చాలామందికి బీపీ లేకపోయినా.. డాక్టర్ ని చూడగానే అదో రకమైన టెన్షన్ ని గురౌతారు. ఆ సమయంలో చెక్ చేస్తే బీపీ ఉన్నట్లుగా చూపిస్తుంది. దానిని ‘ వైట్ కోట్ హైపర్ టెన్షన్’ అంటారు. ఇప్పుడు మనదేశంలో చాలా మంది తెలియకుండానే ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దేశంలో ఈ తరహా బాధితులు పెరిగిపోతున్నట్లు ఇండియా హార్ట్ స్టడీ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది.

వైట్ కోట్ హైపర్ టెన్షన్ తో దేశంలో 24శాతం బాధపడుతున్నట్లు తేలింది. మన రాష్ట్రంలో అయితే 36శాతం వైట్ కోట్ హైపర్ టెన్షన్ బాధితులు ఉన్నట్లు వెల్లడైంది. ఈ సర్వేను ఇండియా హార్ట్ స్టడీ సంస్థ 2018 జూన్ నుంచి గత ఏప్రిల్ వరకు 16 రాష్ట్రాల్లో సర్వే నిర్వహించింది. దీనిలో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా... తెలంగాణ 8వ స్థానం, ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో ఉంది.

అయితే... ఈ సమస్య గురించి అంత పెద్దగా భయపడాల్సిన అవసరం లేమీ లేదని నిపుణులు చెబుతున్నారు. రోగి విషయంలో వైద్యుల అవగాహన లోపంతో ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. హాస్పిటల్ కి రాగానే బీపీ పరీక్షలు చేయకూడదు. ఒక 15 నిమిషాలు ఆగిన తర్వాత పరీక్షలు చేయాలి. అప్పుడు నిజంగా బీపీ ఉందో లేదో అన్న విషయం తెలుస్తుంది. అంతేకాదు మెట్లు ఎక్కి వచ్చిన వెంటనే కూడా పరీక్ష చేయకూడదు. కొందరు వెంటనే ఆయాస పడుతుంటారు. అలాంటి సమయంలో కూడా బీపీ పరీక్ష చేయకూడదు. అది కంట్రోల్ లోకి వచ్చిన తర్వాతే పరీక్ష చేయడం మంచిది.