తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో  వరుసగా రెండోసారి ఎల్డీఎఫ్  అధికారాన్ని చేపట్టే దిశగా దూసుకుపోతోంది.కేరళ రాష్ట్రంలో ఐదేళ్లకోసారి ఎల్డీఎఫ్, యూడీఎప్ కూటములు అధికారంలోకి  వస్తుంటాయి. ప్రతి ఐదేళ్లకు ఓసారి  
కేరళ ప్రజలు  మార్పును కోరుకొంటారని ఈ ఎన్నికల ఫలితాలను చూస్తే  తెలుస్తోంది. 

అయితే  ఈ దఫా ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు వెల్లడించిన సర్వేలతో పాటు ఎన్నికలు పూర్తైన తర్వాత ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ కూడ కేరళలో ఎల్డీఎఫ్ దే అధికారంగా తేల్చి చెప్పాయి. ప్రస్తుతం వస్తున్న ఎన్నికల ఫలితాలు కూడ అదే రకంగా ఉన్నాయి. ప్రస్తుతం ఎల్డీఎఫ్ 87 స్థానాల్లో, యూడీఎఫ్ 50 స్థానాల్లో ఆధిక్యంలో  ఉంది. దేశంలో తొలి కమ్యూనిష్టు ప్రభుత్వం కూడ కేరళ రాష్ట్రంలో ఏర్పడింది. 1957 ఏప్రిల్ 5న  ఈఎంఎస్ నంబూద్రిపాద్ కేరళ సీఎంగా ఎన్నికయ్యారు. 1959లో కేరళ ప్రభుత్వం రద్దైంది.  అప్పటి కేంద్రం కేరళ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. ఆ తర్వాత 1960 ఫిబ్రవరిలో  కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. 1964 వరకు కాంగ్రెస్ నేతృత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగింది. 

1967 మార్చి 6న కేరళ సీఎంగా సీపీఎం నేత ఈఎంఎస్ నంబూద్రిపాద్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 1969 వరకు ఈ ప్రభుత్వం కొనసాగింది.1969 నుండి 1979 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కొనసాగాయి.  1980లో కేరళ రాష్ట్రంలో సీపీఎం అధికారాన్ని చేపట్టింది.1981 వరకు ఈ ప్రభుత్వం కొనసాగింది. 1981 డిసెంబర్ నుండి 1987 మార్చి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగింది.1987 నుండి కేరళలో మరోసారి సీపీఎం అధికారాన్ని చేపట్టింది. సీఎంగా నయనార్ బాధ్యతలు చేపట్టారు. 1991లో సీపీఎం అధికారాన్ని కోల్పోయింది. 1991 నుండి 1996 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది.1996లో కేరళలో సీపీఎం అధికారాన్ని చేపట్టింది. నయనార్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2001 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగారు. 2001 నుండి 2006 వరకు కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకొంది.

2006లో కేరళలో సీపీఎం అధికారాన్ని చేజిక్కించుకొంది.  2006 నుండి 2011 వరకు  వీఎస్ అచ్యుతానందన్  సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్  అధికారాన్ని రెండు మూడు సీట్ల దూరంలో నిలిచింది. 2011 నుండి 2016 వరకు యూడీఎప్ కేరళను పాలించింది. 2016 లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం విజయం సాధించింది.  అప్పట్లో విపక్ష నేతగా ఉన్న అచ్యుతానందన్, విజయన్  మధ్య సీఎం పదవి కోసం పోటీ నెలకొంది. పార్టీ పొలిట్ బ్యూరో సీఎం పదవికి విజయన్ ను  ఎంపిక చేసింది.2021 ఎన్నికల్లో కూడ విజయన్ నేతృత్వంలో మరోసారి  ఎల్డీఎఫ్  విజయం వైపునకు దూసుకుపోతోంది. కేరళలో గోల్డ్ స్కాం తో ఇతర అంశాలను విపక్షాలు తెరమీదికి తీసుకొచ్చినా కూడ  ప్రజలు మాత్రం ఎల్డీఎఫ్ వైపునకు మొగ్గు చూపారనే ఫలితాలను బట్టి తెలుస్తోంది.రాష్ట్రంలో వరుసగా ఎల్డీఎఫ్ అధికారాన్ని చేపట్టడం రాష్ట్రంలో ఇదే ప్రథమంగా మారనుంది. సీఎం విజయన్ ఈ విషయంలో రికార్డును తిరగరాయనున్నారు.