కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఆర్టిసి సమ్మె ఉదృతంగా కొనసాగేతోంది. ఇవాళ(శనివారం) తెలంగాణ బంద్ సందర్భంగా ఆర్టిసి కార్మికులు వివిధ రూపాల్లో తమ నిరసనను తెలియజేశారు. జిల్లావ్యాప్తంగా వున్న అన్ని బస్ డిపోల వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మొహరించినా వెనక్కితగ్గకుండా కార్మికులు కదంతొక్కారు.

ఈ క్రమంలోనే పెద్దపల్లి జిల్లా మంథని బస్టాండ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బంద్ కొనసాగుతున్నప్పటికి ఓ ఆర్టీసీ బస్సు భూపాలపల్లికి బయలుదేరడంతో కార్మికులందరూ ఒక్కసారిగా బస్సు వద్దకు పరుగెత్తుకెళ్లి దాని ముందు బైఠాయించారు. ఇలా బైఠాయించిన వారిలో మహిళ కార్మికులు కూడా వున్నారు.

 అయితే పోలీసులు వీరిని బస్సు ముందునుండి పక్కకు జరపడానికి కాస్త దురుసుగా ప్రవర్తించారు. మహిళా కండక్టర్లను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి పోలీసు వాహనాలలో బలవంతంగా ఎక్కించారు. ఈ క్రమంలో ఓ  మహిళా కండక్టర్ కు గాయాలయ్యాయి. అయినప్పటికి కనికరించని పోలీసులు వారిని అలాగే పోలీస్ స్టేషన్ తరలించారు. 

హైదరాబాద్ లో కూడా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. మిథాని డిపోకు చెందిన 11 మంది మహిళా కండక్టర్లు తెలంగాణ బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో వారిని కంచన్ బాగ్ పోలీసులు అరెస్టు చేసి మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీరిలో శుభవాని అనే మహిళ కండక్టర్ మాదన్నపేట్ పోలీస్ స్టేషన్లో షుగర్ ఎక్కువై పడిపోయింది. 

Telangana Bandh: మహిళా కండక్టర్ల అరెస్టు, షుగర్ తో పడిపోయిన శుభవాని ...

ఇక  జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ బంద్ నేపథ్యంలో కార్మికులు వినూత్న నిరసనకు దిగారు. మెట్ పెల్లి ఆర్టీసీ డిపో వద్ద రాత్రి కురిసిన వర్షానికి  గుంతల్లో ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచింది. దీంతో కార్మికులు ప్రభుత్వ తీరును ఎండగడుతూ కాగితాలతో పడవలు తయారు చేసి నీటిలో వదిలిపెట్టి తమ శైలిలో వినూత్న నిరసనను తెలిపారు.

telangana bandh video : కాగితపు పడవలతో కార్మికులు......

telangana bandh video : బస్సు ముందు బైఠాయించిన మహిళా కండక్టర్ అరెస్ట్...

కార్మికుల సమ్మెకు మద్దతుగా నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన టీజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్ ను, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిని, టీడీపీ నేతలు ఎల్ రమణ, రావుల చంద్రశేఖర రెడ్డిలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో పోలీసులు అరెస్టు చేసే సమయంలో పోటు రంగారావు అనే సిపిఐఎంఎల్ నేత బొటన వేలు తెగిపడింది.