మున్సిపల్ ఎన్నికలే టార్గెట్... టీఆర్ఎస్ నేతల ఇళ్లలోనే ఆ యంత్రాంగం: ఈసికి బిజెపి ఫిర్యాదు
తెలంగాణ రాష్ట్రంలో మరికొద్దిరోజుల్లో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అవకతవకలు,, అక్రమాలకు పాల్పడే అవకాశముందని బిజెపి నాయకులు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నాగిరెడ్డికి పిర్యాదు చేశారు.
కరీంనగర్: తెలంగాణ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. అంతేకాకుండా ఎన్నికల షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలను పారదర్శకంగా జరగనివ్వకుండా అక్రమాలకు తెరతీసిందని బిజెపి నాయకులు కొట్టె మురళీకృష్ణ ఆరోపించారు.
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కరీంనగర్ పట్టణంలో అధికార దుర్వినియోగం, అక్రమాలు, బెదిరింపులకు పాల్పడే ఆస్కారం వుందంటూ మురళీకృష్ణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డికి ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా నగరంలో వివిధ ప్రాంతాల్లో భద్రత కోసం ఏర్పాటుచేసిన సిసి కెమెరాలకు సంబంధించిన ఆపరేటింగ్ సిస్టంలు కొందరు టీఆర్ఎస్ నాయకుల ఇళ్లలో ఉన్నట్లు పేర్కొన్నారు. దీనివల్ల అవకతవలు జరిగే అవకాశం వుందని... వెంటనే వాటిని సదరు నాయకుల ఇళ్లనుండి తొలగించాలని కమీషనర్ ను కోరారు.
read more మేం పవర్‌లోకి వస్తే.. నీకు తిప్పలే: ఎన్నికల కమీషనర్ నాగిరెడ్డిపై జగ్గారెడ్డి ఫైర్
బుధవారం ఫ్యాక్స్ మరియు ఈమెయిల్ ద్వారా మురళీకృష్ణ తన ఫిర్యాదు ఈసీకి పంపించారు. స్థానికంగా ఉన్న ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు ప్రభావితం చేసేందుకు ఆస్కారం ఉన్నందున వెంటనే వాటిని తొలగించాలని... ఆయా డివిజన్లలోని ప్రజా సమూహ సముదాయాలకు లేదా స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించాలని పేర్కొన్నారు.
ఇళ్ళల్లో ఉన్న సిసి టీవీ ఆపరేటింగ్ సిస్టంల ద్వారా టిఆర్ఎస్ నేతలు ఎన్నికల్లో ఓటర్లు మరియు వివిధ అభ్యర్థుల కదలికలను పసిగట్టి దౌర్జన్యాలకు పాల్పడి భయబ్రాంతులకు గురి చేసే ప్రమాదం వుందన్నారు. ముందే బ్లాక్ మెయిల్ రాజకీయాలకు టిఆర్ఎస్ పెట్టింది పేరని అన్నారు.
read more కారణమిదే: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌పై కోర్టుకు కాంగ్రెస్
కాబట్టి మున్సిపల్ ఎలక్షన్స్ సమయంలో ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించి సీసీటీవీ ఆపరేటింగ్ కమాండ్ కంట్రోల్ సిస్టంలను టిఆర్ఎస్ నేతల ఇళ్ల నుంచి తొలగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో కొట్టె మురళీకృష్ణ పేర్కొన్నారు.