హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విషయంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రిజర్వేషన్లు ప్రకటించకుండానే ఎన్నికల షెడ్యూల్‌ ఎలా ప్రకటిస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఈ విషయమై కోర్టుకు వెళ్లనున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.

Also read:తెలంగాణలో పుర పోరు: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల, జనవరి 22న పోలింగ్

వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన ఎన్నికల నోటిపికేషన్ విడుదల కానుంది. జనవరి 8 నుండి 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. జనవరి 11 నుండి నామినేషన్లను పరిశీలించనున్నారు. జనవరి 22న పోలింగ్ నిర్వహించనున్నారు. జనవరి 25న మున్సిపల్ ఓట్లను లెక్కించనున్నారు. 

అయితే మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కాకుండానే ఎన్నికల షెడ్యూల్ నిర్వహించడంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబడుతోంది.

రిజర్వేషన్లు ప్రకటించకపోవడం వల్ల ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులకు అభ్యర్థులను ఎంపిక చేయకుండా చేసే ఉద్దేశ్యంతో చేసిందనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల  చేయడం అధికార టీఆర్ఎస్‌కు అనుకూలంగా చేసేదిగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అభిప్రాయపడుతోంది. 

ఈ విషయమై కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు టీపీసీసీ చీఫ్  ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. అంతేకాదు రిజర్వేషన్లను ప్రకటించకుండానే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంపై కూడ  రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి వినతి పత్రం సమర్పించనున్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికలకు తమ పార్టీ పూర్తి సన్నద్దంగా ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు,కార్పోరేషన్లకు సంబంధించి తమ పార్టీ సర్వసన్నద్దంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.