Asianet News TeluguAsianet News Telugu

కేటీఆర్ అందుకోసమే పనికిరాలేడు... సీఎంగా ఎలా...: మాజీ ఎంపీ సంచలనం

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పై బిజెపి నాయకులు, మాజీ ఎంపీ గడ్డం  వివేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  

BJP Leader Gaddam Vivek  satires on minister ktr
Author
Karimnagar, First Published Jan 11, 2020, 7:51 PM IST

కరీంనగర్: తెలంగాణలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించిన డబ్బులను మున్సిపల్ ఎన్నికల గెలుపుకోసం వాడటానికి సీఎం కేసీఆర్ సిద్దమయ్యారని బిజెపి నాయకులు, మాజీ ఎంపీ గడ్డం వివేక్ ఆరోపించారు. మెగా కృష్ణారెడ్డి కోసమే మిషన్ భగీరథ పథకం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని... ఆయన నుండి భారీ కమిషన్లు వసూలు చేసిన సీఎం వాటినే ఇప్పుడు ఖర్చుచేసి గెలవాలని ఆలోచిస్తున్నారని ఆలోచిస్తున్నారని అన్నారు. 

కరీంనగర్ ను లండన్ చేస్తా అని ప్రగల్భాలు పలికిన సీఎం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని విస్మరించాడని అన్నారు. ఆయన అన్నట్లుగా కరీంనగర్ లండన్ లా తయారయ్యిందా అంటూ వివేక్ ప్రశ్నించారు. ఇంటింటికి నల్లా నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగమన్నారు... ఇప్పుడు నీళ్లు ఇవ్వకపోయినా ఓట్లకోసం సిద్దమయ్యారని అన్నారు. 

కరీంనగర్ మున్సిపాలిటీకి నిధులిస్తామని హామీ ఇచ్చి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 14వ ఫైనాన్స్ నిధులు, కేంద్ర నిధులు తప్ప రాష్ట్రం ఇచ్చింది ఏమీ లేదన్నారు. స్మార్ట్ సిటీ కింద కేంద్రం కరీంనగర్ కు అధిక నిధులిచ్చిందని....డబుల్ బెడ్ రూం ఇళ్లకు కూడా అధికంగా నిధులొచ్చాయన్నారు. 

read more  ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లో జోష్... సొంతగూటికి చేరిన సీనియర్ లీడర్

ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో పెట్టాల్సి వస్తోందనే డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రారంభించడం లేదన్నారు. ఆయుస్మాన్ భవ ద్వారా 5 లక్షల వరకు పొందే అవకాశమున్నా మోడీకి పేరు వస్తుందని అమలు చేయడం లేదన్నారు. 

కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఫెయిలయ్యారు అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేయాలని చూస్తున్నారని అన్నారు. ఆయనను ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్రం మరింత వెనక్కిపోతుందన్నారు. కేటీఆర్  వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 7 సీట్లు ఓడిపోయిందన్నారు. 

సీఎం తుగ్లక్ లాగా ఎర్రమంజిల్ కూలగొడతానంటున్నాడని... రాత్రి ఆలోచన వస్తే పొద్దున సెక్రటేరియట్  కూల్చేస్తానంటాడన్నారు. రాష్ట్రం ఏమోగాని కల్వకుంట్ల కుటుంబం మాత్రం బంగారం అయిందని ఎద్దేవా చేశారు. 

తమ కుటుంబసభ్యులు రాజకీయాల్లోకి రారని ఉద్యమ సమయంలో చెప్పిన కేసీఆర్ అధికారం రాగానే మాట తప్పాడన్నారు. దళిత ముఖ్యమంత్రిని చేస్తానని మాట తప్పడమే కాకుండా ఇప్పుడు  తన స్థానంలో కొడుకు ను సీఎం చేయాలనుకుంటున్నాడన్నారు. ఇలా దళితులకు అన్యాయం చేస్తున్న సీఎం నిజమైన దళిత ద్రోహీ అని వివేక్ మండిపడ్డారు. 

25 మంది ఆర్టీసీ కార్మికులను పొట్టన పెట్టుకున్నది ఈ కేసీఆరేనని ఆరోపించారు. మరో 25 మంది సమ్మె సమయంలో బస్సు ప్రమాదాల్లో చనిపోయారని...దీనికి కూడా సీఎం నిరంకుశ పోకడలే కారణమన్నారు. ఎంపీగా ఓడిపోయిన వినోద్ కు ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు.

read more  కేటీఆర్ కు తలనొప్పులు: దిగిరాని రెబెల్స్, నేతల మధ్య ఆధిపత్యపోరు

టీటీడీ పాలకవర్గంలో ప్రస్తుతం ముగ్గురు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉన్నారని ఆరోపించారు. కవితను రాజ్యసభకు పంపుతానని అంటున్నాడని....ఇవన్నీ ఎన్నికల్లో ప్రజలకు చెబుతామని వివేక్ పేర్కొన్నారు. 

సీఏఏ విషయంలో సీఎం ఎందుకు మజ్లిస్ కు మద్ధతునిస్తున్నాడో అర్థం కావడం లేదన్నారు. సీఏఏ ఎవరికీ వ్యతిరేకం కాదని...ఎన్.పి.ఆర్ లో వివాదస్పద వివరాలున్నాయని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఎన్నార్సీ 1950లోనే వచ్చిందని ఇది ఇప్పుడు కొత్తదేం కాదన్నారు. 

అస్సాంలో సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారమే ఎన్నార్సీ అమలవుతోందని తెలిపారు. కావాలనే కొందరు ముస్లిం సోదరులను రెచ్చగొడుతున్నారని వివేక్ ఆరోపించారు. అన్ని ముస్లిం దేశాల్లోనూ ఇలాంటి చట్టాలున్నాయని..అక్రమ చొరబాటు దారులను అరికట్టేందుకు సీఏఏ అవసరమన్నారు. 

బీజేపీ పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారన్నారు. హుజూర్ నగర్ పరిధిలో గతంలో ఓటుకు 5 వేలు ఇచ్చి టీఆర్ఎస్ గెలిచిందని...డబ్బులకు ఆశపడి ప్రజలు ఓటును అమ్ముకోవద్దని వివేక్ ఓటర్లకు సూచించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios