కామర్స్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రష్యాలో ఉద్యోగావకాశాలు!
భారత చార్టర్డ్ అకౌంటెంట్లకు, కామర్స్ విద్యార్థులకు కేంద్రం తీపి కబురు తెలిపింది. ఐసీఏఐ, ఐపీఏఆర్‌ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసి రష్యాలో ప్రొఫెషనల్ అకౌంటెంట్ ఉద్యోగ అవకాశాలకు మార్గం సుగమం చేసింది. ఉభయ దేశాల మధ్య ప్రొఫెషనల్ అకౌంటెన్సీ ట్రెయినింగ్, ఆధునిక పోకడలు, విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి అంగీకరించుకోవడంతో కామర్స్ విద్యార్థులు మరింత నైపుణ్యవంతులై మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నారు.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కామర్స్ విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది. రష్యాలో ఉద్యోగావకాశాలకు మార్గం సుగమం చేసింది. అంతేకాదు, అకౌంటెన్సీ రంగంలో భారత సేవలను రష్యాలో వినియోగించుకునే అవకాశానికి కేంద్రం తెరలేపింది. తద్వారా భారత సీఏలకు మరిన్ని అవకాశాలు అందివచ్చినట్టయింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రొఫెషనల్ అకౌంటెంట్స్ ఆఫ్ రష్యా(ఐపీఏఆర్)ల మధ్య ఒప్పందాన్ని కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. తద్వారా ప్రొఫెషనల్ అకౌంటెన్సీ శిక్షణ, ప్రొఫెషనల్ ఎథిక్స్, సాంకేతిక పరిశోధన వంటివి మరింత సానపెట్టుకోవడానికి అవకాశాన్నిచ్చింది.
ఉన్నత విద్య కోసం ఆలోచిస్తున్న బి.కామ్ లేదా కామర్స్ విద్యార్థులకు అత్యుత్తమ చాయిస్ సీఏ(చార్టర్డ్ అకౌంటెంట్) అనేది నిర్వివాదాంశం. సీఏ పట్టా పొందితే తిరుగులేని కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. దేశీయంగానూ టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్లతోపాటు విదేశాల్లోనూ రాణించవచ్చు.
మనదేశంలో సీఏ పరీక్షను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ నిర్వహిస్తుంది. ఇందులో మూడు స్థాయిల్లో పరీక్షలుంటాయి. ఒకటి సీపీటీ, రెండోది ఐపీసీసీ, చివరిది సీఏ. ఈ పరీక్షలతోపాటు మూడేళ్ల ప్రాక్టికల్ ట్రెయినింగ్ తర్వాత ఐసీఏఐ సభ్యుడిగా ఎన్‌రోల్ అవుతారు. అప్పుడు, ఆ సభ్యుడిని సీఏగా పరిగణిస్తారు. ఐసీఏఐ చట్టబద్ధ సంస్థ. ట్యాక్స్ ఫైలింగ్స్, ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ల ఆడిటింగ్‌లో వీరిది తిరుగులేని చరిత్ర. దేశ విదేశాల్లో సీఏకు భారీ డిమాండ్ ఉన్నది.
మనదేశంలో ఐసీఏఐ లాగే, రష్యాలో ఐపీఏఆర్. ప్రొఫెషనల్ అకౌంటెన్సీ ట్రెయినింగ్, ఆధునిక అకౌంటింగ్ విజ్ఞానం, ప్రొఫెషనల్ మరియు ఇంటెలెక్చువల్ డెవలప్‌మెంట్ సహా పలు అంశాలపై ఈ రెండు సంస్థలు పరస్పరం సహకరించుకోనున్నాయి. తద్వారా మనదేశంలో కామర్స్ విద్యార్థుల భవిష్యత్తు మరింత వెలుగులీనబోతున్నది.
ఐసీఏఐ సభ్యుల ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా ఒప్పందం ఏర్పడింది. దీని ద్వారా ఐసీఏఐ సభ్యులకు రష్యాలో ఉద్యోగ అవకాశాలకూ ఆస్కారం ఏర్పడినట్టు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఉభయ దేశాల మధ్య బంధాలను బలోపేతం చేయడంతోపాటు అకౌంటెన్సీ రంగంలో మన సేవలను రష్యాలో వినియోగించుకోవడానికి వీలు చిక్కింది. తద్వారా భారత సీఏలకు అదనపు అవకాశం లభించినట్టయింది.