గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 31 శాతం అధికంగా నియమాకాలు జరపాలని కంపెనీలు నిర్ణయించుకున్నాయి. ఇందుకోసం బడ్జెట్‌ కేటాయింపులు కూడా 34% పెంచాయని ‘నైపుణ్యాల నియామకాల స్థితి 2019’ అనే పేరుతో మెర్సర్‌ మెటిల్‌ విడుదల చేసిన రెండో వార్షిక నివేదిక తెలిపింది.

అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2018లో నియామకాలు 25 శాతం, అందుకోసం బడ్జెట్‌ 20 శాతం కంపెనీలు పెంచాయని సంస్థ పేర్కొంది. నియామక ప్రక్రియలో టెక్నాలజీ పాత్ర కీలకమైందని మెర్సర్ మెటిల్నివేదిక వెల్లడించింది.

నియామక విపణిలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకునేందుకు, మెరుగైన నైపుణ్యాలు గల వారి ఎంపికకు ఉపకరిస్తోందని తెలిపింది. తగినంత మంది నిపుణుల ఎంపికతోపాటు  వారిని అట్టే పెట్టుకోవడం, వారి సామర్థ్యాన్ని వినియోగించుకోవడంలోనూ టెక్నాలజీ దోహద పడుతోందని పేర్కొన్నది. 

నిపుణుల ఎంపికలో తమకు స్వల్పంగా మాత్రమే ఇబ్బందులు ఎదురవుతున్నాయని పెద్ద సంస్థల ప్రతినిధులు 67 శాతం మంది తెలిపారు. కీలక పోస్టులకు మాత్రం, విపణిలో ఉన్న దానికంటే ఎక్కువ ఇస్తామన్నా, తగిన అభ్యర్థులు దొరకడం లేదనీ పలువురు పేర్కొన్నారు. 

దేశంలోని వివిధ సంస్థల్లో నియామకాలు జరిపే నిర్ణయాధికారం కల  ఉపాధ్యక్షులు, సీనియర్‌ - కార్య నిర్వాహక ఉపాధ్యక్షుడు, సీ సూట్‌ ఎగ్జిక్యూటివ్‌లు, డైరెక్టర్లు, మేనేజర్లు, మానవ వనరుల విభాగాధికారులు.. 900 మంది నుంచి సేకరించిన సమాచారంతో ఈ నివేదిక రూపొందించినట్లు మెర్సర్ మెటిల్ తెలిపింది. 

భిన్న పదవులకు తగిన అభ్యర్థులను కనిపెట్టి, ఉత్తమమైన వారినే ఎంపిక చేసుకోవడం సవాలుగా మారుతోందని మెర్సర్ మెటిల్ సీఈఓ కేతన్ కపూర్ తెలిపారు. ముఖ్యంగా గిరాకీ ఉన్న నైపుణ్యాల్లో ఇది మరింత సంక్లిష్టమవుతోందన్నారు. అధిక వ్యయాలతో పాటు సమయం కూడా ఎక్కువ పడుతోందన్నారు.

అత్యుత్తమ నైపుణ్యాలు గలవారి కోసం పోటీ రోజురోజుకీ తీవ్రమవుతోందని మెర్సర్ మెటిల్ సీఈఓ కేతన్ కపూర్ తెలిపారు. ఈ ప్రక్రియలను విజయవంతం చేసేందుకు కంపెనీలకు టెక్నాలజీ ఉపకరిస్తుందని, వివిధ రంగాల్లో నియామకాల ధోరణి ఈ ఏడాది సరికొత్తగా మారనుందని  మెర్సర్‌ మెటిల్‌ సీఈఓ కేతన్‌ కపూర్‌ స్పష్టం చేశారు.