కరోనా సెకండ్ వేవ్‌ వల్ల ఇప్పటికే భారత్‌లో భారీగా కేసులు, మరణాలు నమోదవుతున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు లాక్‌డౌన్ వంటి ఆంక్షల వల్ల ఆర్ధిక పరిస్ధితులు దిగజారిపోతున్నాయి. ఎన్నో కంపెనీలు నష్టాలను మూటకట్టుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో భారత్‌లో నిరుద్యోగాన్ని కరోనా సెకండ్‌ వేవ్‌ మరింత పెంచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే గడిచిన ఏప్రిల్‌ నెలలో నిరుద్యోగిత రేటు ఎనిమిది శాతం పెరిగి నాలుగు నెలల గరిష్టానికి చేరింది.

రానున్న కాలంలో లాక్‌డౌన్‌లు, ఆంక్షలు మరింత తీవ్రమయ్యే పరిస్థితులు ఉండటంతో నిరుద్యోగం మరింత పెరిగే అవకాశం వుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్చిలో నిరుద్యోగ రేటు 6.5 శాతం ఉండగా.. అది ప్రస్తుతం 7.97 శాతానికి చేరింది.

Also Read:కరోనా సెకండ్ వేవ్ : ఒకరి నుంచి ఒకేసారి ముగ్గురికి వ్యాప్తి... !!

కరోనా ప్రభావంతో ఏప్రిల్ నెలలోనే దాదాపు 70 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్ ఇండియన్‌ ఎకానమీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (సీఎంఐఈ) అనే సంస్థ వెల్లడించింది. లాక్‌డౌన్‌ల వల్ల ఉద్యోగాల లభ్యతలో కొరత నెలకొందని సీఎంఐఈ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహేష్‌ వ్యాస్‌ పేర్కొన్నారు.

వైరస్‌ వ్యాప్తి తీవ్రం కావడంతో మే నెలలో కూడా ఇదే పరిస్ధితి కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రెండంకెల అభివృద్ధిని సాధిస్తుందని చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రల వారీగా ఆంక్షలు పెరిగే కొద్దీ వీటిల్లో మరింత మార్పు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బార్ల్కెస్‌ బ్యాంక్‌ పీఎల్‌సీ  సోమవారం అంచనాలను సవరించింది.